రాష్ట్ర ఎన్నికల సంఘం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఆత్మకూరు 23, వెంకటగిరి 25, నాయుడుపేట 25, సూళ్లూరుపేట 26 చొప్పున మొత్తం 99 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఈ నాలుగు పురపాలక సంఘాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని, మొత్తం 531 మంది నామినేషన్లు అందించారని వివరించారు. ఆత్మకూరు 114, వెంకటగిరి 144, నాయుడుపేట 152, సూళ్లూరుపేట 121 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు, లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.