Nadu Nedu Scheme: నెల్లూరు జిల్లాలో 1379 పాఠశాలల ఆధునికీకరణకు ప్రభుత్వం 467 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో 335 చోట్ల ప్రహరీలు, 914 పాఠశాలలకు తాగునీటి వసతి, 1,008 మరుగుదొడ్ల నిర్మాణం.. 2,001 అదనపు తరగతి గదులు, 904 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకూ సుమారు 93 కోట్ల రూపాయలతో 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో నిధుల లేమి కారణంగా.. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కొన్నిచోట్ల పునాదుల వద్ద.. మరికొన్ని చోట్ల గోడల స్థాయిలో నిలిచిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే విద్యాసంవత్సరం నాటికైనా అదనపు తరగతి గదులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
తరగతి గదుల సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో దెబ్బతిన్న గదుల్లోని పై పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. దీంతో రేకులషెడ్లలోనూ.. చెట్ల నీడలోనూ చదువులు కొనసాగిస్తున్నారు. వీటికి తోడు విద్యుత్ సదుపాయం లేకపోవడం.. భోజనశాలలు, మరుగుదొడ్లు లేక ఎదుర్కొంటున్న సమస్యలు అదనమని విద్యార్థులు వాపోతున్నారు.
పాఠశాలల్లో మౌళిక వసతులు లేకపోవడంతో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్ధులు, ప్రభుత్వ హాస్టల్స్లో ఉండే విద్యార్ధులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అరకొర వసతులతో.. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోందని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పథకానికి నిధులు కేటాయించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.