ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్లుగా గుడిసెలోనే చదువు.. 'నాడు-నేడు'లో కన్పించని బడి - Nellore News

school in hut: నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నాం. ప్రైవేటు బడులకంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాం. ఇదీ ప్రభుత్వం తరచూ చెప్పే మాట. కానీ.. అదంతా మాటల్లోనే. చేతల్లో కాదని ప్రభుత్వ పాఠశాలలే రుజువు చేస్తున్నాయి. కావాలంటే ఇది చదవండి మీకే తెలుస్తుంది.

SCHOOL IN HUT
గుడిసెలో పాఠశాల

By

Published : Nov 7, 2022, 8:53 PM IST

నెల్లూరు జిల్లా గోపన్నపాళెం గిరిజన కాలనీలో పూరి గుడిసెలో పాఠశాల

SCHOOL IN HUT: తాటకులతో పైకప్పు, చుట్టూ సిమెంట్​ ఇటుకలతో పేర్చిన గోడతో చిన్న గుడిసె. ఆ గుడిసె చుట్టు పశువుల సంచారం. పాఠశాల గురించి అని ఇలా రాశారేంటి అనుకుంటున్నారా. మీరు చదువుతున్నది పాఠశాల గురించే. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గోపన్నపాళెం గిరిజన కాలనీలో ఉంది. మా ఎస్సీలు, ఎస్టీలు అని ఎప్పుడూ సీఎం చెప్పే.. ఎస్టీ కాలనీలోనే ఈ బడి ఉంది. అక్కడి పేదపిల్లలే ఈ పూరిపాక బడిలో విద్యను అభ్యసిస్తున్నారు.

కాలనీ నుంచి దూరంలో ఉన్న ఊళ్లోని బడిలోకి వెళ్లాలంటే మధ్యలో వాగులు, వంకలు దాటాలి. అందుకు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గిరిజన విద్యార్దులకు విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో 2018లో ఐటీడీఏ ఆద్వర్యంలో ప్రాథమిక పాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు తోచినంత వేసుకుని నిర్మించుకున్నారు. ఐతే ప్రభుత్వం నాడు - నేడులో మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

"మా పిల్లలు గ్రామంలోని పాఠశాలకు వెళ్లేవారు. ఇబ్బందిగా ఉందని.. సార్​ చదువు చెప్పడానికి ఇక్కడికే వస్తాను, ఇక్కడే బడి ఏర్పాటు చేసుకోండని చెప్పారు. ప్రభుత్వానికి చాలా సార్లు అర్జీలు పెట్టుకున్నాము. అధికారులు ఎవరూ పట్టించుకోకపొవటంతో.. మేమే ఓ గుడిసె ఏర్పాటు చేసుకున్నాము. అందులోనే పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నాము. గత ఐదు సంవత్సరాల నుంచి ఇలానే పాఠశాల నడుస్తోంది. ప్రతి సంవత్సరం గుడిసె పైకప్పు సరిచేసుకోవటం.. దాని నిర్వహణ మేమే చూసుకుంటుంన్నాం". - గోవిందమ్మ, స్థానిక మహిళ

"నేను ఇక్కడ సీఆర్టీగా పని చేస్తున్నాను. 2018లో ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. గతంలో వీళ్లు గోపాన్నపాళెం ఎంపీపీఎస్​లో చదువుకునేవారు. అది దూరంగా ఉంది. మధ్యలో వాగు ఉండటం వల్ల.. గిరిజన సంక్షేమ శాఖకు మొర పెట్టుకోవటంతో గిరిజన విద్య వికాస కేంద్రం కింద ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు". -మల్లికార్జున, సీఆర్టీ ఉపాధ్యాయుడు

పిల్లల ఇబ్బందులపై ఎంఈవోని వివరణ కోరగా నాడు - నేడు రెండో విడత కింద ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

"గోపాన్నపాళెంలో గిరిజన జనాభా ఉండటంతో అక్కడ పాఠశాల ఏర్పాటు చేశాము. దాంతో తాత్కలికంగా వసతులు ఏర్పాటు చేయటం జరిగింది. నాడు-నేడు రెండో విడతలో దీనికి శాశ్వత భవనం గురించి ప్రతిపాదన పంపించాము. ఐటీడీఏ వాళ్లు కూడా ప్రతిపాదనలు పంపారు. మా ద్వారా కూడ పాంపించాము". -శ్రీధర్, ఎంఈవో

ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేసి, నూతన భవనాన్ని నిర్మించి తమ పిల్లల వెతలను తీర్చాలని.. వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details