నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట గ్రామంలోని హరిజన కాలనీలో ప్రస్తుత పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు, మురుగు కాలువలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిరోడ్డు మునిగిపోవడం వల్ల వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల పాములు, తేళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం వస్తే మాకు నరకం కనిపిస్తుందని వాపోయారు. అధికారులకు మా సమస్యలను పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నామని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.