Sangam Barrage: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు సరైన రవాణా మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంగం వద్ద పెన్నానదిపై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో.. అధ్వానంగా ఉన్న లో లెవల్ వంతెన మార్గంలో ప్రయాణిస్తూ.. నెల్లూరు, పొదలకూరు, చేజెర్ల, సంగం మండలాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ గుంతలతో పాటు నదికి అడ్డుగా వేసిన ఇసుక బస్తాల నుంచి నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ దారిలో వెళ్లేందుకు వాహనాదారులు జంకుతున్నారు..
జాతీయ రహదారిని కలిపే ఈ వంతెన మార్గంలో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గోతులతో పూర్తిగా పాడైన ఈ దారిలో ప్రయాణించడం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ద్విచక్రవాహనాదారులు తరుచుగా ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.