BC unity round table meeting updates: నెల్లూరు జిల్లాలోని కస్తూరి దేవి గార్డెన్స్‌లో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్ జరిగింది. ఈ సమావేశానికి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్నీ పార్టీల నాయకులు పాల్గొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, వాటి పరిష్కారాలపై, భవిష్యత్తు కార్యచరణపై బీసీ కుల సంఘాలు నాయకులు ప్రసంగించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, అఖిలపక్ష బీసీ నాయకులు హాజరయ్యారు.
టీడీపీ గెలిస్తేనే బీసీలకు భవిష్యత్.. ఈ సందర్భంగా బీసీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో సగానికిపైగా ఉన్న బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అన్యాయాలను ఎదురించాలంటే బీసీలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. గత నాలుగేళ్లలో బీసీలపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకుని.. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో నేడు ఈ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో బీసీలకిచ్చిన సబ్సిడీ రుణాలు, ఇతర పరిహారాలను నేటి ప్రభుత్వం పూర్తిగా బంద్ చేసిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటిదాకా దాదాపు 30 మంది బీసీలు హత్యకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ పెట్టారని, ఆ తర్వాత బీసీలు ఆ రిజర్వేషన్లు కోల్పోయారని ఆయన వాఖ్యానించారు.