Rottela Pandaga In Nellore: నెల్లూరులో ఐదు రోజుల పాటు సాగే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. ఏటా బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగను వీక్షించేందుకు హిందూ, ముస్లీం అనే తారతామ్యలు లేకుండా మతాలకు అతీతంగా భక్తులు తరలివస్తారు. ఈ పండుగ తమ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని భక్తులు చెబుతున్నారు. ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు 10లక్షలు మందికిపైగా ప్రజలు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు.
భారీగా జనం రాకతో స్వర్ణాల చెరువు, దర్గా ప్రాంతం కిక్కిరిసింది. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, ఐశ్వర్యం వంటి అనేక కోర్కెలతో భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 2వేల 5వందల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం గంధోత్సవం కావడంతో రాత్రి నుంచి భక్తులు నెల్లూరు నగరానికి తరలివచ్చారు. ఈ ఒక్క రోజు రెండు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రోజున ప్రధాన రొట్టెల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. బారాషాహీద్ దర్గాను ఆనుకుని ఉన్న భక్తులు స్వర్ణాల చెరువులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఏపీనుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాకిడి అధికమైతే.. రొట్టెల పండుగ ఉత్సవాలను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది.