నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో రహదారుల సమస్య ప్రధానంగా మారింది. ప్రచారానికి వెళ్తున్న నాయకులకు అస్తవ్యస్తంగా మారిన రహదారులే దర్శనమిస్తున్నాయి. ఇంటింటి ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు రహదారి సమస్యలే వినిపిస్తున్నారు. అధికార వైకాపా అభ్యర్ధులకు రోడ్ల సమస్య తలనొప్పిగా మారింది. జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాట వేస్తున్నారు.
గత రెండేళ్లుగా నగరంలో ప్రధాన రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటికి కనీస నిర్వహణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికితోడు ఇటీవల ఐదు రోజులుగా వర్షాలు కురవడంతో రోడ్లు మరింత దారుణంగా మారాయి. ప్రచారంలో జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రహదారి సమస్యలే ఎదురయ్యాయి. పింఛన్లు వచ్చినా రాకపోయినా ముందు రోడ్డు వేయించండి అంటూ మంత్రిని ఓ మహిళ వేడుకుంది.