Injustice to Farmers in Land Acquisition: నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి పొదలకూరు మండలం మీదుగా బద్వేలు వైపు కడప రోడ్డును విస్తరణ చేస్తున్నారు. విస్తరణలో భాగంగా బిరదవోలు, పార్లపల్లి, కల్యాణపురం, ముత్యాలపేట, బాపనపల్లి గ్రామాల్లో భూముల సేకరణకు ధర నిర్ణయించకుండానే సర్వే చేసి అధికారులు హద్దులు నిర్ణయించారు. సుమారు 50మంది రైతులు తమ సాగు భూములను కోల్పోతున్నారు. 50ఏళ్లుగా సాగునీటి సదుపాయం ఉండటంతో వరి, నిమ్మ పంటలను సాగుచేస్తున్నారు. అధికారుల మెట్ట భూములుగా ఉన్నాయని.. రైతులతో సంప్రదింపులు చేయకుండా ఎకరాకు ఏడున్నర లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చే విధంగా చెక్కులు తయారు చేశారని రైతులు వాపోయారు.
"బిరదవోలు రైతులు అందరూ వ్యవసాయం చేసుకునే వారు. అందరికీ ఎకరం, అర ఎకరం పొలాలు ఉన్నాయి. జాతీయ రహదారి ఏర్పడుతోందని అధికారులు వచ్చి 7లక్షల 80వేలు ఇస్తామంటున్నారు. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఎకరం 20 లక్షల నుంచి 40లక్షల రూపాయలకు వరకు ఉంది. వాళ్లు ఇచ్చే డబ్బులకు వేరే దగ్గర కొనడానికి కనీసం 20సెంట్ల భూమి కూడా రాదు. మాకు ఆ రేటు ఇస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే. మంత్రికి చెప్పాం, ఆర్డీవోకి చెప్పాం, జాయింట్ కలెక్టర్కు చెప్పాం.. మమ్మల్ని చెక్కులు తీసుకోమని చెపుతున్నారు. వచ్చిన డబ్బులు తీసుకోండని చెపుతున్నారు.. మిగిలినవి తర్వాత ఇస్తామని చెప్తున్నారు.. కానీ ఎంత ఇస్తారో క్లారిటీగా చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో రైతులం ఉన్నాం"-శ్రీనివాసులరెడ్డి, రైతు
ధర నిర్ణయంపై అసహనం వ్యక్తం చెస్తున్న రైతులు కొందరైతే.. అసలు భూ సర్వేలో పేర్లు ప్రకటించకుండా, పరిహార చెల్లింపుల్లో కూడా అధికారులుతమ పేర్లను నమోదు చేయలేదని మరికొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరపకుండానే మార్కెట్ ధరల్లో మూడో వంతు ధరలు నిర్ణయించటంపై వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు న్యాయమైన ధర ప్రకటించి.. భూముల రీసర్వే చేపట్టాలని కోరుతున్నారు.