వరిసాగు అంటేనే గుర్తుకొచ్చేది నెల్లూరు జిల్లా. అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు చేయటం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. వేరుశనగ, చెరకు వంటి పంటలు సాగు చేసినా.. అధిక ప్రాధాన్యత వరి సాగుకే ఇస్తారు. అటువంటి జిల్లాలో సాగుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాకపోగా.. రైతులను నష్టాలు ముంచెత్తుతున్నాయి. రైతులు, కౌలు రైతులు కష్టాలు పడుతున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో ఏటా 5లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. జిల్లాకు తూర్పు ప్రాంతాలైన నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి వ్యవసాయ సబ్ డివిజన్లలో బీపీటీ 5203 రకం, జిలకర, మసూరి రకం వరినాట్లు ముందస్తుగా వేస్తున్నారు. సాగుకు కూలీల ధరల నుంచి పురుగుల మందులు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయనీ.. ధాన్యం ధరలు తగ్గుతున్నాయని రైతులు వాపోతున్నారు.
వరి సాగుకు కష్టపడుతున్న నెల్లూరు అన్నదాత
అత్యధిక విస్తీర్ణంలో వరి పండించే జిల్లాగా నెల్లూరు పేరుగాంచింది. అటువంటి జిల్లాలో ఇప్పుడు రైతులు వరి సాగుకు కష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో నష్టాలు చవిచూస్తున్నారు.
వరి నాట్లు వేసేందుకు గతేడాది 3,200 రూపాయలు ఖర్చు అవ్వగా.. ఇప్పుడు 4,500 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. వరి సాగుకు పొలాన్ని సన్నద్ధం చేసేందుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయానీ.. గతంతో పోలిస్తే ధరలన్నీ రెట్టింపు అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకోర్చి వరిని సాగు చేసినా.. గిట్టుబాటు ధర అందటం లేదనీ, నూర్పిడిలు అయ్యాక ధాన్యం నిల్వ చేసేందుకు సదుపాయం లేక తక్కువ ధరకే అమ్మాల్సి వస్తోందని వాపోయారు. దళారుల మోసాలకు రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారనీ.. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు.