గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. 13,480 ఎకరాలలో కృష్ణపట్నం నోడ్‌గా అభివృద్ధి చేయబోయే చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా 18,600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో 2,140 ఎకరాలలో ఈ కారిడార్ ను అభివృద్ధి చేసి, మూడేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రతిపాదిత రామాయపట్నం పోర్ట్‌కు అనుబంధంగా కావలి వద్ద రెండు వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని సరస్వతి నగర్లో 25 కోట్ల రూపాయల వ్యయంతో స్టీమ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు అవార్డులను అందించారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పి భాస్కర్ భూషణ్ లతోపాటు పలువురు ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.