కరోనా ధాటికి ఉపాధి కోల్పోయి.. ఆకలితో అలమటించే పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు నెలకు రెండుసార్లు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల నుంచి కిలో బియ్యాన్ని 7 రూపాయలకు కొనుగోలు చేసి.. బయట 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
జోరుగా దందా..
నాయుడుపేట రాజగోపాలపురంలోని బియ్యం వ్యాపారి.. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాలను తరలించేందుకు వాహనంలోకి బియ్యాన్ని ఎక్కిస్తున్నాడు. విషయం బయటకు తెలియడంతో ఈటీవీ-ఈటీవీభారత్ బృందం అక్కడికి చేరుకుంది. చౌక బియ్యం బస్తాలను వాహనానికి ఎక్కిస్తుండగా అక్కడి దృశ్యాలను చిత్ర, వీడియో రూపంలో బంధించింది. గమనించిన యజమాని ఇవి నెల్లూరు జిలకర బియ్యమని, తడ మండలం అపాచీ కంపెనీకి పంపుతున్నట్లు, ఇందులో ఎలాంటి మోసం లేదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అంతా పద్దతి ప్రకారం లేబుల్ వేసి ఉన్నాయని, మిల్లుల నుంచి తెప్పించి ఎగుమతి చేస్తున్నట్లు చెబుతూనే బేరసారాలకు సిద్దమయ్యాడు.
బేరసారాలు..
వ్యానులో ఉన్న బస్తాల్లోని బియ్యం బయటకు తీసి.. ఇవి రేషన్ బియ్యం కదా అని ప్రశ్నించగా.. అందులో కొన్ని బస్తాలు మాత్రమే చౌక బియ్యమని.. మిగిలినవి నెల్లూరు జిలకర రకానికి చెందిన బియ్యంగా చెప్పసాగారు. గోదాములో ఉండే బస్తాలను పరిశీలించిన ఈనాడు-ఈటీవీ బృందాలు.. ఇవన్నీ రేషన్ బియ్యమని, వాటిని వేరువేరు పేర్లతో ఉన్న గోనె సంచుల్లో వేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీనిపై ప్రశ్నించిన ఈనాడు-ఈటీవీ బృందాలతో సదరు వ్యక్తి బేరసారాలకు దిగాడు. ‘ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, వదిలేయండి.. మీకేం కావాలో చెప్పండి చేస్తాం.. చిత్రాలు, వీడియోలు తీయడం ఆపేయండి’ అంటూ కాళ్ల బేరానికి దిగాడు.