Rains in Nellore district: నెల్లూరు జిల్లా కావలి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో నాలుగో రోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు నగరం కావలి శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు, డైకస్ రోడ్డు, బుజబుజ నెల్లూరు వద్ద రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో అనేక కాలనీల్లోని ఇళ్లలోకి నీరు వచ్చింది. కోవూరు సమీపంలో రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తోంది. గుడ్లూరు మండలం ఉప్పుటేరు ప్రవాహంతో గుడ్లూరు- బసిరెడ్డిపాలెం మద్య నిన్న రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రవాహం తగ్గుతోంది. లోయర్ ఉప్పుటేరు ప్రవాహంతో మన్నెటికోట మధ్య రాకపోకలు నిలిచాయి.
నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు 18004251113, 0861 230 1541 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కమీషనర్ హరిత కోరారు. బోగోలు మండలం నాగులవరం సమీపంలో ఎస్వీపీయం ఛానల్‌కు గండి పడటంతో నీటి ప్రవాహం వస్తోంది. బోగోలు మండలం జక్కపల్లి గూడూరు చెరువు కలుజు నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉలవపాడు మండలం ఆత్మకూరు వద్ద చప్టాపై మున్నేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. కందుకూరు, కలిగిరి, కొండాపురం, డీసీపల్లి ప్రాంతాల్లో మిరప, పొగాకు, మినుము పంటకు నష్టం జరిగింది.