తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సముద్ర తీరంలో పులికాట్ ఉప్పునీటి సరస్సు ఏర్పడింది. సముద్రంలోని ఆటుపోటుల నుంచి వచ్చే ఉప్పునీటితో సహజసిద్దంగా వందల ఏళ్ల కిందట ఏర్పడింది. ఆరంబాకం నుంచి తడ, సూళ్లూరుపేట, వాకాడు వరకు 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 460 కిలోమీటర్లు ఆంధ్రావైపు, 140 కిలోమీటర్లు తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పులికాట్‌ను సంరక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న 460 కిలోమీటర్ల నిర్వహణను వదిలివేశారు. ఫలితంగా సరస్సు పూడిపోతుంది. స్వరూపం కోల్పోయింది.
460 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్న సరస్సు 100 కిలోమీటర్లు విస్తీర్ణం మట్టితో పూడిపోయింది. సరస్సు లోపల ఇసుక, మట్టి మేటలతో మైదానంలా మారింది. ఇది స్వరూపం కోల్పోడానికి కారణం సముద్రంలో అటుపోటుల వల్ల వచ్చే నీరు పులికాట్‌లోకి రావడంలేదు. సముద్రాన్ని, పులికాట్‌ను రెండు భాగాలుగా విభజిస్తూ పెద్ద మేటలు ఏర్పడ్డాయి. పులికాట్‌లోకి నీరు రావాలంటే పూర్వం రాయదొరువు, కొండూరు వద్ద ప్రధానమైన రెండు ముఖద్వారాలు ఉన్నాయి. ఈ ముఖద్వారాల నుంచి సముద్రం నీరు ఆటుపోటుల ద్వారా పులికాట్‌లోకి వస్తే సరస్సు కళకళలాడుతుంది.
గత 20 ఏళ్లుగా ముఖద్వారాలు పూడిపోవడం మొదలయ్యాయి. పూర్తిగా మూసుకుపోవడంతో ఆటుపోటుల ద్వారా పులికాట్‌లోకి నీరు రావడం లేదు. పులికాట్ చుట్టూ 60పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 25వేల కుటుంబాలు పులికాట్లో చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 25 వేల మంది ఆధారపడి ఉన్నారు. పులికాట్లో సముద్ర ఉత్పత్తులు లేకపోవడంతో ఉపాధిని కోల్పోయారు. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పులికాట్ సరస్సులో అనేక రకాలైన చేపలు, రొయ్యలు దొరుకుతాయి. ఒక్కసారి వేటకు వెళ్లారంటే ప్రతి కుటుంబం రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు. ప్రస్తుతం వేట మొక్కుబడిగా మారింది. చెన్నై ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేట జరగకపోవడంతో మత్స్యకారులు హోటల్స్‌లోనూ, దుకాణాల్లోనూ కూలీలుగా పనిచేస్తున్నారు. రోజుకు మూడునాలుగు వందల రూపాయల కూలీకి వెళ్తున్నామని వారు వాపోతున్నారు. పిల్లలను చదివించుకోవడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు.