భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు.. జవసత్వాలు చేకూర్చిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్-పీఎస్ఎల్వీ.. మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తూ.. 52వ ప్రయోగాన్ని సఫలీకృతం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్వీ-సీ50 వాహననౌక నిప్పులు కక్కుకుంటూ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకొని వెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం మధ్యాహ్నం 3గంటల 41 నిమిషాలకు.. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
సీఎంఎస్-01 ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. భారత ప్రధాన భూ భాగంతోపాటు అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్‌లో సీ-బ్యాండ్ సేవల విస్తరణకు ఇది దోహదపడనుంది.