నెల్లూరు జిల్లాలో మొత్తం 61 గ్రంథాలయాలున్నాయి. జిల్లా కేంద్రంలో పెద్ద గ్రంథాలయం ఉంది. అన్నిచోట్లా సమస్యలే తాండవిస్తున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కో గ్రంథపాలకుడికి అదనపు బాధ్యతలున్నాయి. కొన్నేళ్ల క్రితం చేపట్టిన నియామాకాలతోనే సాగదీస్తున్నారు. పలుచోట్ల అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే మరికొన్నిచోట్ల గ్రంథాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి.
ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని నిర్వాహకులు అంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారని... అవి పూర్తిగా పాడయ్యాయని చెబుతున్నారు. రాపూరు, చిల్లకూరు, మైపాడు, అల్లూరు, అనంతసాగరం మండల కేంద్రాల్లో వర్షాలకు గదుల నుంచి నీరు చిమ్ముతోంది. చాలా పుస్తకాలు చెదలు పట్టి, వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాఠకులు వాపోతున్నారు.