నెల్లూరు జిల్లాలో అక్టోబర్ 15 నుంచి రబీ సాగు మొదలవుతోంది. జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాలకుపైగా వరి పంట సాగవుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో రబీలో వరిపంటను పండిస్తారు. ఇంత పంట సాగు చేయాలంటే కనీసం 80 వేల నుంచి లక్ష క్వింటాళ్లు వరి విత్తనం అవసరం. ప్రతి ఏడాది ఏపీసీడ్స్ ద్వారా 20 వేలకు మించి విత్తనాలు రైతుకు దొరకడం లేదు. పంట సాగు చేసే సమయంలో విత్తనం సరఫరా చేయడం వల్ల రైతుకు సరిగా చేరడం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఏపీసీడ్స్ - వ్యవసాయశాఖ అధికారులు రానున్న రబీలో విత్తనం కొరత తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజులు ముందుగానే రైతుకు విత్తనం చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులోకి 8,999 క్వింటాళ్లు
ఇందుకోసం ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. విత్తనాన్ని రైతు బరోసా కేంద్రాలకు చేర్చి...అక్కడి నుంచి రైతుకు విత్తనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఎన్ఎల్ఆర్-34449, బీపీటీ-5204, ఏంటీయూ-1156, ఆర్.ఎన్.ఆర్-15048 వరి రకాలను వినియోగిస్తారు. ఈ నాలుగు రకాలు 26వేల క్వింటాళ్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు మొదటి దశలో 8వేల999 క్వింటాళ్లు సిద్దం చేశారు.
ప్రణాళికతో ముందుకు...
రబీకి మరో మూడు నెలలు సమయం ఉన్నందున రైతులకు కావాల్సిన విత్తన అవసరాన్ని తీర్చేలా... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ నుంచి విత్తనం తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీసీడ్స్ సలహాలతో విత్తనం పంటను పండించేందుకు కొందరు రైతులను ఎంపిక చేశారు. వారి ద్వారా మంచి ఆరోగ్యకరమైన విత్తనాన్ని తయారు చేయిస్తున్నారు. విత్తనం పండించే రైతులకు ప్రత్యేక ధరలను అందిస్తున్నారు.