లక్షల జనాభా కలిగిన నెల్లూరు నగరం.. మురికి కూపంగా మారుతోంది. నగరానికి ఎటువైపు చూసినా దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చే చెరువులు సైతం వ్యర్థాలతో నిండిపోయాయి. అధికారుల మొక్కుబడి ప్రతిపాదనలకు తోడు ప్రజల నిర్లక్ష్యంతో.. పంట కాలువలు నాశనమవుతున్నాయి. వందేళ్ల క్రితం నగరం నుంచి వెళ్లేలా సర్వే కాలువ ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల క్రితం ఈ నీటినే తాగేవారు. ఇంత స్వచ్ఛంగా ఉండే కాలువ.. నేడు వ్యర్థాలకు నిలయంగా మారింది.
నగరంలోని పెన్నా బ్యారేజి సమీపం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా 20 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. 100 మీటర్లు వెడల్పు ఉండే కాలువ, 50 మీటర్లకు కుచించుకుపోయింది. మరోవైపు.. పంటకాలువలోకి నగర పాలక సంస్థ అధికారులే మురుగు కాలువలను మళ్లించేలా చేసిన నిర్మాణాలపై.. తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. హోటళ్ల యజమానులు ఇష్టాను సారం ఆక్రమించేసి... వ్యర్థాలను కూడా అందులోనే పడేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.