WAR BETWEEN MLA MEKAPATI AND YCP LEADERS : రాష్ట్రంలో రాజకీయం రణరంగంగా మారుతోంది. అధికార పార్టీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలు, వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల పరస్పర దూషణలతో రాజకీయం వాడివేడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాలో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎమ్మెల్యే మేకపాటి సవాళ్లు.. వైసీపీ నేతల ప్రతిసవాళ్లతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యేX వైసీపీ నేతలు అన్నట్లు పరిస్థితి మారింది. పార్టీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై సవాళ్లు చేస్తున్న నాయకులకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. నిన్న ఉదయగిరిలోని బస్టాండ్ సమీపంలో నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ తనపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారికి సవాల్ విసిరారు.
అయితే మేకపాటికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో రోడ్డుపై బైఠాయించి మేకపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నాయకుడు వినయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రావాలంటూ వైసీపీ కార్యకర్తలు ప్రతి సవాల్ విసిరారు. తాము లేనప్పుడు వచ్చి మాటలు చెప్పడం కాదని.. దమ్ముంటే ఇప్పుడు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతి సవాల్ విసురుతూ వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అయితే ఇప్పుడు ఉదయగిరిలో ఏం జరుగుతుందోనని ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వస్తే.. ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న అనుమానాలు అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.