Police Trampled on BJP leader head with feet: సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వారు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని కావలి పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్న సమయంలో కావలిలోని ఉదయగిరి వంతెన కూడలి వద్ద.. బీజేపీ నేతలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి పేట్రేగిపోతుందని.. దీనిపై తక్షణమే సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, కావలి మండల అధ్యక్షులు మామిడాలు వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు బీజేపీ నేతలున్నారు.
పైకి లేవకుండా తలని రెండు కాళ్లతో తొక్కిపట్టి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభానికి ముందు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే అవినీతిపై నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డుపడేందుకు ప్రయత్నం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొందరు నాయకులు ప్లకార్డులతో ముఖ్యమంత్రికి నిరసన తెలిపారు. ఉదయగిరి రోడ్డు వద్ద వాహనాలకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి పెరిగిపోయిందంటూ.. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీగా పోలీసులు వచ్చి నిరసనకారులను అడ్డుకున్నారు. కాన్వాయ్కి అడ్డుపడకుండా పక్కకు లాక్కుపోయారు. డీఎస్పీ వెంకట రమణ బీజేపీ నాయకుడిని కింద పడేశారు. అనంతరం ఆ వ్యక్తి పైకి లేవకుండా అతని తలని.. రెండు కాళ్ల మధ్య ఇరికించారు. కాన్వాయ్ వెళ్లేంత వరకు ఇద్దరు బీజేపీ నాయకులను కిందపడేసి నొక్కిపట్టారు. ఐదుగురు సభ్యులను పోలీస్ స్టేషన్కి తరలించారు.