శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతవూరు శేషాద్రి రైస్ మిల్లులో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుపడ్డాయి. పక్కా సమాచారంతో సివిల్ సప్లై జిల్లా అధికారి వెంకటేశ్వర్లు కావలి అధికారులతో కలిసి రైస్ మిల్లులో తనిఖీ చేశారు. అప్పటికే లారీల్లో సుమారు 600 బస్తాలు ఉండగా మిల్లులో మరో 400 బస్తాల బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో పాటు పెద్ద కుప్పగా ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అయితే అవి ఎన్ని బస్తాలు ఉంటాయో లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సుమారు 1,500 బస్తాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు పట్టుబడిన బియ్యం విలువ సుమారు పది లక్షలు రూపాయలు ఉండొచ్చని తెలిపారు. మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో బియ్యం.. ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు అనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
25 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి చెందిన ఓ వ్యాపారి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలో 25 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కుప్పం మున్సిపాలిటీ పరిధి బైరుగాని పల్లి వద్ద అధికార పార్టీకి చెందిన ఓ వ్యాపారి రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. అతడు రేషన్ బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు విజిలెన్స్ అధికార్లకు సమాచారం అందింది. గత కొన్నేళ్ళుగా అక్రమం జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తరలింపునకు సిద్ధంగా ఉన్న 25 టన్నుల బియ్యంతో పాటు లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సదరు వ్యాపారితో పాటు మరొక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులులు కేసు నమోదు చేశారు.