కడప, నెల్లూరు జిల్లాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను(red sandalwood seized in nellore and kadapa districts) స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియా అటవీప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఉదయగిరి మండలం జి.అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కోసినపోగు ప్రభాకర్.. కొందరు వ్యక్తుల ద్వారా ఎర్రచందనం దుంగలను నరికించి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ విక్రయాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నెల రోజుల కిందట ఆర్లపడియా అటవీ ప్రాంతం నుంచి అదే గ్రామానికి చెందిన ముంగర మాలకొండయ్య, ప్రకాశం అనువారు ఆరు ఎర్రచందనం దుంగలను నరికి తెచ్చారన్నారు. ఆ దుంగలను సీతారామపురం మండలం కోయల పాడు ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేష్, ముత్తుకూరు గ్రామానికి చెందిన వెంగయ్యతో కలసి కోవూరుకు చెందిన రత్నంకు విక్రయించటానికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఘటనలో ప్రభాకర్, మాలకొండయ్య, ప్రకాశంలను అరెస్టు చేసినట్లు తెలిపారు. దుంగలను తరలించేందుకు ఉపయోగించిన కారు రెండు బైకులను సీజ్ చేయడంతోపాటు వారి వద్ద నుంచి రెండు చరవాణీలను స్వాధీనం చేసుకున్నమన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.