నెల్లూరు జిల్లా గూడూరులో సంచలనం సృష్టించిన తేజస్విని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఏఎస్పీ వెంకటరత్నం మీడియాకు వివరాలు తెలియజేశారు. గూడూరులో ఉంటున్న తేజస్విని, వెంకటేశ్వర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తేజస్విని వెంకటేశ్వర్లుకు దూరంగా ఉంటోంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్వర్లు.. ఈనెల ఒకటో తేదీన ఇద్దరు స్నేహితుల సహకారంతో స్వర్ణభారతి నగర్ లోని తేజస్విని ఇంటికి వెళ్లాడు.
ఒంటరిగా ఉన్న ఆమెను ఓ గదిలో బంధించాడు. కత్తితో పొడిచి, టవల్ ను మెడకు బిగించి హతమార్చాడు. స్థానికులు, పోలీసులు వచ్చి తలుపు తట్టడంతో భయపడిన వెంకటేశ్వర్లు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చిత్రీకరించాడు. ప్రేమికుల ఆత్మహత్యగా అప్పుడు ఈ కేసు సంచలనమైంది. అయితే.. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రియుడే తేజస్విని హతమార్చినట్లు నిర్ధారించారు.