ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టులో చోరీ కేసు ... పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక కేసులో ఆధారాల చోరీతో జిల్లా ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని కూపీ లాగుతున్నారు. ఇక ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని.... బయట తిరుగుతున్న నిందితుల బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది.

NELLORE COURT
NELLORE COURT

By

Published : Apr 16, 2022, 5:27 AM IST

కోర్టులో చోరీ కేసు ... పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు..

దేశచరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కోర్టులో దొంగలు పడటం..అదీ ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్నపత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలించడంతో నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాజకీయ ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నేరుగా రంగంలోకి దిగి విచారణజరుపుతున్నారు. కీలకపత్రాలు ఎక్కడున్నాయి.? ఎక్కడి నుంచి దొంగిలించారనే వివరాలు తెలుసుకున్నారు. కేసు చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టరు మధుబాబును రంగంలోకి దించారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల కేసును ఛేదించడం కష్టమైనా కోర్టుకు వెళ్లే దారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్యలో.... దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ పాత నేరస్థులేనని తెలుస్తోంది. రెండు నెలల కిందట రాయాజీవీధిలో జరిగిన ఓ చోరీ కేసులో వీరు నిందితులు. ఓ వృద్ధురాలిని కట్టేసి బంగారు నగలు దొంగిలించారు. అప్పట్లో వీరిపై దోపిడీ కేసు కాకుండా నామమాత్రపు కేసు నమోదు చేశారు. జైలు నుంచివిడుదలైన తర్వాత కోర్టులో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. బండిపై ఉల్లిపాయలు విక్రయించే వారిద్దరూ...స్నేహితులేనని సమాచారం. త్వరలోనే పోలీసులు కేసు పూర్వాపరాలు వెల్లడించే అవకాశం ఉంది.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు దొంగిలించడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పోలీసుల్ని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. గతంలో తన కుటుంబసభ్యులకు ఇతర దేశాల్లో ఆస్తులున్నాయంటూ కాకాణి నకిలీ పత్రాలు సృష్టించారని గుర్తుచేశారు. తాను దాఖలు చేసిన ఈ కేసులో శిక్ష పడుతుందని సాక్ష్యాలు చోరీ చేశారని వివరించారు. కోర్టులో చోరీని తేలిగ్గా తీసుకోరాదని, ఈ విషయంపై గట్టిగా పోరాడాలని తెదేపా నేతలు నిర్ణయించారు.

ఇదీ చదవండి:Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'

ABOUT THE AUTHOR

...view details