రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లాలో కావ్య హత్యకేసులో నిందితుడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది. పొదలకూరు మండలం తాటిపర్తిలో జరిగిన ఈ ఘటన..అనేక ప్రశ్నలకు తావిస్తోంది. పెళ్లికి నిరాకరించిందని కావ్యను కాల్చిన సురేశ్ రెడ్డి..తానూ కాల్చుకుని చనిపోయాడు. సురేశ్ రెడ్డికి చెందిన రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్యకు వాడిన తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందో ఛేదించేపనిలో ఉన్నారు. హత్యకు 7.5 ఎంఎంపిస్టల్ వాడినట్లు గుర్తించారు.
గతంలో సురేశ్ ఎవరెవరితో మాట్లాడాడు. ఎవరితో సంప్రదింపులు జరిపాడనే సమాచారం రాబట్టేందుకు ఫోన్లలో సంక్షిప్త సమాచారాలు, చాటింగ్ వివరాలు పరిశీలిస్తున్నారు. సురేశ్ సహోద్యోగులు, స్నేహితులపైనా నిఘా పెట్టారు. గతేడాది డిసెంబర్లో సురేశ్ బిహార్, ఉత్తరప్రదేశ్, ముంబయి, పట్నా, దిల్లీ తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. తుపాకీ కొనడానికే వెళ్లాడా,..అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాటిపర్తిలో సురేశ్‌రెడ్డితో సన్నిహితంగా ఉండే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.