"మొక్కుబడిగా కాకుండా... బాధ్యతగా మొక్కలు నాటాలి"
మొక్కను నాటామా... ఫోటోకు ఫోజులిచ్చామా... వెళ్లిపోయామా అని కాకుండా అవి పెరిగేలా చూడాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మొక్కలు నాటినప్పుడు ఫోటోలకు ఫోజులిచ్చిన అధికారులు.. ఆ తరువాత వాటి పెంపకంపై అశ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అలాకాకుండా ప్రతి ఒక్కరూ.. మొక్కలు నాటి.. దానిని బ్రతికించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నెల్లూరులోని కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. ప్రజలు లక్షల మొక్కలు నాటామని చెబుతున్నారే తప్ప.. మరలా వాటి గురించి పట్టించుకోవటంలేదని అన్నారు. విద్యార్థులు వారి ఇంట్లో ఒక మొక్క నాటి దానిని బతికించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. దేశం, రాష్ట్రంలో ఉండవలసిన దానికన్నా చెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. చెట్లు లేకపోతే వాతావరణ పరిస్థితి దెబ్బతింటుందని... ఆ పరిస్థితులు రానివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.