ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడి అభివృద్ధికి ప్రతిబంధకంగా.. పశుసంవర్ధక శాఖ పనితీరు..! - Appointment of Gopala Mitras in Nellore

నెల్లూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ పనితీరు పాడి పరిశ్రమ పురోగతికి గుదిబండగా పరిణమిస్తోంది. మూగజీవాలు వ్యాధులతో కునారిల్లుతుండగా క్షేత్రస్థాయిలో అవసరమైన వివిధ మందులు అందుబాటులో ఉండటం లేదు. సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. పశువైద్యశాలల పనితీరు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. తమ ఉపాధి కోల్పోయి పశుపోషకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. పాడి అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది.

Performance of Animal Husbandry Department Officers
పశుసంవర్ధక శాఖ పనితీరు

By

Published : Dec 3, 2020, 4:34 PM IST

నెల్లూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ అధికారుల పనితీరు పాడి అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. పశువులకు ఏ జబ్బు వచ్చినా అందుకు అనుగుణంగా అన్నిరకాల మందులు పశువైద్యశాలల్లో అందుబాటులో ఉండాలి. కానీ చాలావాటిల్లో లేవు. యాంటీబయాటిక్స్‌, జలుబు, పొదుగు వాపు వంటి వ్యాధులకు మందులు సమృద్ధిగా లేవు. అధిక మోతాదులో ఉన్నాయని గతంలో ఆంక్షలు విధించిన టింక్చర్‌, గ్లిజరిన్‌, దూది తదితరాలకు ఇప్పుడు కొరత ఏర్పడింది. పశువుల్లో ఎక్కువగా సోకే గాలికుంటు వ్యాధిని దేశం నుంచి పారద్రోలాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వ్యాధికి టీకాలను కూడా విస్తృతంగా సరఫరా చేస్తోంది. అయితే ఈ టీకాలను రిఫ్రిజిలేటర్లలోనే నిల్వ ఉంచాలి. కానీ అన్ని ఆసుపత్రులకు ఆ సదుపాయం లేదు. ఒక్కో టీకా రూ.650కు కొనుగోలు చేసి నిల్వ సదుపాయం లేక వృథాగా పడేస్తున్నారు.

పొంచి ఉన్న వ్యాధులు...

ప్రస్తుతం వర్షాలు కురిసి చలిగాలులు వీస్తున్నాయి. ఈ కాలంలో పశువుల్లో గొంతువాపు లేక గురక వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. గొర్రెల్లో నీలి కాలుక, గిరక వాపు, కాలికుంటు వ్యాధులొస్తాయి. మేకల్లో జలుబు, దగ్గు వస్తుంటుంది. బ్యాక్టీరియా వల్లే ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుదలతో వీటి తీవ్రత అధికమవుతోంది. వర్షానికి కొత్తగా మొలకెత్తే గడిని తినే గొర్రెలకు నేల మురక వ్యాధి సంక్రమిస్తుంది. అయితే అన్ని వ్యాధులకు వ్యాక్సిన్లు ఉన్నా.. వాటి నిర్వహణ, లభ్యతపై సరైన కార్యాచరణ లేకపోవడంతో పశువులకు భారంగా మారింది.

అందని పూర్తిస్థాయి సేవలు...

గ్రామ సచివాలయాలన్నింటా పశుసంవర్ధక సహాయకుల ద్వారా సేవలందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇదే సందర్భంలో నూతనంగా గోపాల మిత్రల నియామకాలను నిలుపుదల చేశారు. గతంలో నియమించిన గోపాలమిత్రలకు సంవత్సర కాలంగా వేతనం ఇచ్చింది లేదు. పశుసంవర్ధక సహాయకుల పోస్టులు కూడా చాలావరకు ఖాళీగా ఉండటంతో పశుపోషకులకు సరైన సేవలు దక్కడం లేదు. గ్రామాల్లో వీరి అవసరం ఎంతో ఉన్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయట తెచ్చుకోమని డాక్టర్‌ రాసిచ్చిన చీటీ

అన్ని మందులు ఆసుపత్రిలోనే ఇస్తున్నాం..

పశువులకు సంబంధించిన అన్ని మందులు ఆసుపత్రుల్లో ఇస్తున్నారు. బయట కొనుగోలు చేయమని ఎవరికీ చెప్పడం లేదు. టీకాలు నిల్వ చేసుకునేలా అన్ని ఆసుపత్రుల్లో రిఫ్రిజిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ రిఫ్రిజిలేటర్లలో నిల్వ చేస్తున్నారు. పశు సంపద వృద్ధికి కృషి చేస్తున్నాం.

-వెంకట రమణ, సహాయ సంచాలకులు, కావలి

గ్రామాలకు విస్తరించాలి...

పొట్టేలు కాళ్లు ముడుచుకుపోతుంటే బయట దుకాణాల్లో మూడు మందు సీసాలు ఒక్కోటి రూ.75 వంతున కొన్నా. జీవాలను ఆసుపత్రులకు తరలించాలంటే వ్యయప్రయాసగా ఉంటోంది. పశుసంవర్ధక శాఖ తమ సేవలను గ్రామాలకు విస్తరిస్తే మాకు భారం తగ్గుతుంది. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

-డి.హజరత్తయ్య, కొత్తపల్లి, కావలి మండలం

కొన్నింటిని కొంటున్నాం..

వానాకాలంలో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. నా గేదెలకు కొన్ని మందులు మాత్రమే ఆసుపత్రిలో ఉచితంగా ఇస్తున్నారు. మరికొన్నింటిని బయట కొనుగోలు చేస్తున్నా. ప్రభుత్వమే పూర్తిగా సేవలందిస్తే బాగుంటుంది.

-తోట పట్టాభిరామిరెడ్డి, పాడి రైతు, వైకుంఠపురం, కావలి

వివరాలు:

గ్రామీణ పశువైద్యశాలలు: 79

వెటర్నరీ డిస్పెన్సరీలు: 114

ప్రాంతీయ (ఏడీ స్థాయి)

పశువైద్యశాలలు: 23

రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా పశువైద్య విభాగాలు: 666

(ఇప్పటికే ఏర్పాటు 150

ప్రస్తుతం ఏర్పాటు కానున్నవి 200

వచ్చే నెలలో 316)

మేకలు 3,63,546

గొర్రెలు 10,78, 987

గేదెలు 7,18,765

ఆవులు, ఎద్దులు 1,87,788

ఇదీ చదవండి:

సీసాల్లో నిర్మాణాలు.. సుద్దముక్కలపై అద్భుతాలు

ABOUT THE AUTHOR

...view details