Dump In Nellore : రాష్ట్రంలో వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు ఒకటి. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో సుమారు 9లక్షల మంది నివసిస్తున్నారు. విశాలమైన నగరమైనప్పటికీ చెత్తా చెదారం, దుర్వాసనల మధ్యే లక్షల మంది ప్రజలు నిత్యం జీవనం కొనసాగించాల్సి వస్తోంది. మరి, ఈ సమస్య పరిష్కారం దిశగా ఏ ప్రజాప్రతినిధి ముందుకు రావడం లేదు. మొత్తం 54డివిజన్లలోని కార్పొరేటర్లతో సహా మేయర్, డిప్యూటీ మేయర్లంతా వైసీపీ నుంచి ఎన్నికయిన వారే. అంతేగాకుండా నెల్లూరు నగరం, గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ తరఫువ ప్రాతినిథ్యం వహిస్తున్నవారే. వైసీపీ పాలకులకు ప్రజలు ఎంతో నమ్మకంతో కార్పొరేషన్ అప్పగిస్తే.. వారు మాత్రం ఎటువంటి ప్రణాళిక లేకుండానే పాలనను సాగిస్తున్నారు. మురుగు కాలువల్లో సరైన నీటి పారుదల లేక అస్తవ్యస్థంగా మారి కాలువలన్నీ దుర్వాసనను వెదజల్లుతున్నాయి. వీటి మధ్యే తాము జీవనం సాగిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. అటు ఇదే కాలువలకు అనుకుని ఎంతోమంది హోటల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నగరంలో ఏ ఒక్క అధికారి గానీ, ప్రజా ప్రతినిధి గానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రోజుకు 320మెట్రిక్ టన్నుల చెత్త ఉత్ప్తతి అవుతోంది. ఇంత చెత్తను సేకరించేందుకు ప్రతి ఏడాది వాహనాల నిర్వహణ కోసం 3కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇందులో 150ఆటోలు, 6 పెద్ద కాంపాక్టులు, 20 చిన్న కాంపాక్టులు, 14 ట్రాక్టర్లతో పాటు 4 టిప్పర్లు ఉన్నాయి. కానీ, ఈ వ్యవస్థ అంతా గుత్తేదారుల చేతుల మీదుగానే నడుస్తోంది. వారి పనితీరు అంతంత మాత్రమే. దాంతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోతోంది. నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను పట్టణ నడిబొడ్డులోని బోడిగాడితోటలో పోస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త లాంటి తేడాలేమీ ఇక్కడ కనిపించవు. దాంతో చుట్టుపక్కల ఉన్న అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్తను వేయడానికి ఐదేళ్లుగా సరైన స్థలం లేని పరిస్థితి... నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో నెలకొంది.
ఏటా వాహనాల నిర్వాహణకు 3కోట్లు, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు 14కోట్ల 28లక్షలను ఖర్చు చేస్తున్నారు. కాగా, సొసైటీ కార్మికులు 877మంది, శాశ్వత కార్మికులు 344మంది, కాంట్రాక్ట్ పద్దతిలో 200మంది పనిచేస్తున్నారు. ఇంత వ్యవస్థ ఉన్నా వారిని ప్రణాళిక ప్రకారం పనిచేయించుకోవడంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా విఫలమయ్యింది. బ్లీచింగ్, ఫినాయిల్ అంటూ అడ్డగోలుగా బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. కానీ, కార్యఫలితం మాత్రం శూన్యం. దాదాపుగా పనులన్నీ వైసీపీ గుత్తేదారులకే అప్పగిస్తున్నారు. ప్రజారోగ్యంలో కూడా నాయకులు వ్యాపారాలు చేస్తుంటే పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా ఎలా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ నిర్వహణ పాలకులు, అధికారులు నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఇక స్వచ్ఛత మాట సరే సరి. కార్పోరేషన్ పరిధిలో ఇప్పటివరకు డంపింగ్ కోసం ఏ అధికారి కూడా ప్రత్యేకంగా స్థలం కేటాయించలేకపోయారు. నెల్లూరు నగరంలోని చెత్తను అంతా దొంతాలి వద్ద ఉన్న డంపింగ్‌లో వేస్తున్నారు. అంత చెత్త ఒక దగ్గర చేరడంతో అది ఓ కొండను తలపిస్తోంది. ఇళ్లలో నుంచి చెత్త సేకరణ చేసే సమయంలో తడిచెత్త, పొడిచెత్త, బయో వ్యర్థాలు అనే పేరుతో సేకరిస్తున్నారు. వాటిని వేటికవి వేరు చేయకుండా అన్నింటినీ కలిపి డంపింగ్ యార్డులో పడేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని స్థానికులు అంటున్నారు. కొండలా పేరుకుపోతున్నడంప్‌ను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో చెత్తను కాలుస్తున్నారు. దీనివల్ల కాలిన వ్యర్థాల పొగ చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఇళ్లలోకి పోతుంది. ఆ పొగ పీల్చితే రోగాల బారిన పడుతామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సమస్యకు ఒక కచ్చితమైన పరిష్కారం ఉంటుంది. కానీ, ఇక్కడి పారిశుద్ధ్య సమస్యకు కారణం.... నెల్లూరు కార్పోరేషన్ కార్యాలయంలో సిబ్బందికి, అధికారులకు, పాలకులకు మధ్య సమన్వయం లేకపోవడమే. నెల్లూరు జిల్లా కేంద్రంలోనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఉంటారు. వీరు కూడా ఈ పరిస్థితులను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదు. నెల్లూరు నగరంలోనే ఓ మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నివాసం ఉంటున్నప్పటికీ స్వచ్ఛ నెల్లూరుగా మార్చడానికి మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.