సామాన్యులకు చుక్కల చూపిస్తున్న సీఎం పర్యటనలు People Problems With CM Jagan Tour : సీఎం జగన్ పర్యటించిన ప్రతీచోటా సామాన్య ప్రజల నుంచి పలు ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. విషయం ఏంటంటే.. ఈ నెల 12న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక అంతే అధికారులు భద్రత పేరిట.. పేద ప్రజల్ని హడలెత్తించారు. బహిరంగ సభ వేదిక పరిసరాల్లోని అంబేడ్కర్ కాలనీలో.. చెట్లు కొట్టేయించారు. ఆఖరికి విద్యుత్ స్తంభాలు కూడా తీసేయిస్తామని.. హెచ్చరించారు. ఎక్కడో దూరానున్న స్తంభాలు మీకేం అడ్డంటూ జనం ఆక్రోశించారు.
ఇక విశాఖ పీఎం పాలెంలో జగన్ బహిరంగ సభకు.. ఓ పచ్చని చెట్టు బలైంది. జగన్ పర్యటన ముందురోజు దాకా పచ్చదనం పంచిన చెట్టు.. ఇప్పుడు ముక్కలైంది. నలుగురికీ నీడనిచ్చిన వృక్షం జగన్ భద్రతకు అడ్డొచ్చిందట! అందుకే అధికారులు.. దాన్ని నరికేయించారు. ముఖ్యమంత్రి భద్రతకు కచ్చితంగా ప్రాధాన్యమివ్వాల్సిందే. అందులో రాజీపడనే కూడదు. కానీ.. భద్రత ఏర్పాట్ల పేరిట యథేచ్ఛగా చెట్లు నరికేయడమేంటి? ఓ మొక్క వృక్షంగా మారాలంటే.. కొన్ని దశాబ్దాలు పడుతుంది. వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే పచ్చదనంపై గొడ్డలివేటు వేయడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలు.. జనానికి పరమ చిరాకు తెప్పించాయి. భోగాపురానికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలోని.. జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు నిలిపేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల వద్ద, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద ఉదయం నుంచే వాహనాలు ఆపేశారు. పక్క జిల్లాలో సీఎం పర్యటిస్తే.. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆపేయడం ఏంటో ఎవరికీ అంతుచిక్కడంలేదు.
ఇక జగన్ పర్యటన ప్రభావం.. సామాన్య జనం పైనే కాదు.. చిరువ్యాపారల పైనా తీవ్రంగా ఉంటుంది. జగన్ వెళ్లే మార్గంలో ముందు నుంచే బారికేడ్లు పాతేస్తారు. కిలోమీటర్ల మేర... అక్కడుండే దుకాణాలు.... మూసేయిస్తారు. జగన్ వచ్చే రెండు రోజుల ముందు నుంచే వ్యాపారాలు ఆగిపోతాయి. అంతే.. ఎంతో మంది చిరువ్యాపారులు, దుకాణదారులు, తోపుడు బండ్లపై వస్తువులు పెట్టుకుని అమ్ముకునేవారు, వాణిజ్య సంస్థల వారికి.. ఆ రెండ్రోజులు ఆదాయం పోయినట్లే. అందుకే జగన్ పర్యటనంటే చాలు.. బెంబేలెత్తుతున్నారు.
ఈ ఆంక్షలను జగన్ సభకు వచ్చి వెళ్లే దాకా జనం పాటించాల్సిందే. కాదని ఎవరైనా రోడ్డెక్కితే.. ఇదిగో ఇలా ఉక్కుపాదం మోపుతారు. కావలిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా.. నిరసనకు యత్నించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడుని పోలీసులు ఇలా కాళ్ల మధ్యలో అదిమిపట్టారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే జనం చూడడానికి ఆసక్తిచూపుతారు. కానీ.. అలాంటి వారిని పోలీసులు భద్రతా చర్యల పేరుతో తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఎన్ని గంటలు.. నరకయాతన అనుభవించాలో అని వాహనదారులు మండిపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గానీ,. ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడా ఎన్నడూ లేనంత అతిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నారనే.. విమర్శలున్నాయి. ప్రజల్ని ఇక్కట్లు పాల్జేయటమే భద్రతా అని ఆక్రోశిస్తున్నారు.
సీఎం సభ బయటేకాదు.. లోపలా పోలీసుల తీరు వివాదాస్పదమే. సభలోకి పెన్నుల్ని అనుమతించరు. ఫ్లకార్డులు తీసుకెళ్లనివ్వరు. జగనన్నకు ఎక్కడ నిరసన తెలుపుతారో అని నల్లటి వస్త్రాల్నీ.. అనుమతించని రోజులు ఉన్నాయి. ఇక లోపలికి వెళ్లిన వారిని మీటింగ్ మధ్యలో రానివ్వరు. బయటకు వెళ్లనీయకుండా గేట్లు మూసేస్తారు. ఎవరైనా ఉక్కపోతకు మగ్గాల్సిందే..లేదంటే సొమ్మసిల్లిపోవాల్సిందే. అనంతపురం జిల్లా నార్పలలో సీఎం సభకు హాజరైన ఓ విద్యార్థిని.. బారికేడ్ల బంధనాలు దాటే క్రమంలో అస్వస్థతకు గురైంది. ఇలా ముఖ్యమంత్రి పర్యటనలు.. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఇవీ చదవండి: