నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల తీరప్రాంత గ్రామాల్లో దుస్థితి ఇది. జిల్లాలో 169 కిలోమీటర్ల తీరప్రాంతంలో ప్రధానంగా ఆక్వా సాగు జరుగుతోంది. 11 వేల హెక్టార్లలో దాదాపు 7 వేల మంది రైతులు చేపట్టారు. ఇందులో అక్రమసాగు ప్రహసనంగా మారింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించి గుంతలు తవ్వేయగా.. అధికారుల అనుమతి లేకుండానే పెంపకం చేస్తుండటం గమనార్హం. అక్కడితో ఆగకుండా గుంతల్లోని వ్యర్థజలాలను ఇష్టారాజ్యంగా పరిసర కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఫలితంగా అవి రూపుకోల్పోయి రంగు మారుతున్నాయి. అదే నీరు చెరువుల్లోకి చేరుతుండటంతో సాగు సాగని దుస్థితి. చివరకు భూగర్భజలాలు కలుషితమవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.
●కాలుష్య నియంత్రణ మండలి అధికారులిచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. అక్రమ రొయ్యలసాగుతో సెల్‌నిటీ తీవ్రంగా ఉంటున్నట్లు ప్రస్తావించారు. 2,925 ఎకరాల అధికారిక ఆయకట్టు ఉన్న మల్లాం చెరువులో ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు నిగ్గుతేల్చారు. ఆ నీరు పశువులు తాగే పరిస్థితి లేదని, భూగర్భజలాలు కలుషితమవుతున్నట్లు స్పష్టం చేశారు. 2100 ఎంజీ/లీటరు సరాసరిగా టీడీఎస్ ఉండాల్సి రాగా.. మల్లాం చెరువులో 5 వేల నుంచి 11 వేల మధ్య ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యధికంగా ఉందని ప్రస్తావించారు. గుంతల్లోని వ్యర్థ జలాలను పరీక్షిస్తే 8 వేల నుంచి 17 వేల మధ్య టీడీఎస్ ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఆ నీటిని శుద్ధి చేయకుండానే బయటకు వదిలేస్తున్నట్లు నివేదించారు. నాలుగైదు నమూనాల్లో ఈ మేరకు ఫలితాలు వచ్చాయి.
● వ్యవసాయశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. చిట్టమూరు వద్ద ఈసీ వాల్యూ 0.2 నుంచి 4.4గా ఉంది. ఇక్కడ 2 ఉంటేనే నేల సాధారణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2 కన్నా ఎక్కువ ఉంటే సమస్యాత్మక నేలగానే భావిస్తారు. వాకాడు మండలంలో పరీక్షించిన గ్రామాల్లో 0.4 నుంచి 11.6గా ఉంది. కోట మండలంలో 0.2 నుంచి 4.9గా నమోదైంది.
● పీహెచ్ వాల్యూ చిట్టమూరు మండలంలో 5.3 నుంచి 8.2గా, వాకాడులో 6.3 నుంచి 8.3గా, కోటలో 5.7 నుంచి 7.4గా మట్టి పరీక్షలో నమోదైంది. 7 కన్నా ఎక్కువగా ఈ విలువలు ఉంటే ఆల్కలైన్ సమస్య ఉన్నట్లని అధికారులు పేర్కొన్నారు. ఈ మూడు నివేదికల్లోనే ‘సెల్‌నిటి’ సమస్య తీవ్రంగా ఉన్నట్లు ప్రస్తావించారు. ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.
నివేదికే చెబుతోంది..
ఈ వ్యవహారంపై కొందరు రైతులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు చర్యలు చేపట్టింది తెలిసిందే. ఆ నివేదిక ఇటీవలే సిద్ధం కాగా.. అందులో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా మూడు మండలాల్లోని ఏడు గ్రామాల పరిధిలో సెల్‌నిటి ఏస్థాయిలో ప్రమాద సంకేతాన్ని సూచిస్తోందో స్పష్టం చేశారు. ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. 40 మట్టి, నీటినమూనాలు సేకరించగా.. అందులో 52.5 శాతంలో నాన్ సెల్‌నిటి, 20 శాతం స్వల్పంగా, 17.5 శాతం మోడరేట్ సెల్‌నిటి, 5 శాతం స్ట్రాంగ్ సెల్‌నిటి, 5 శాతంలో వెరీ స్ట్రాంగ్ సెల్‌నిటీ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా మల్లాం చెరువులో నీటిని పరీక్షించగా.. సెల్‌నిటి శాతం గణనీయంగా నమోదైనట్లు ప్రస్తావించారు.