నెల్లూరు జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల మేర సంగం నుంచి సోమశిల వరకు పెన్నా ప్రవాహం ఉంటుంది. ఇంత పొడవైన పెన్నానది వరద రూపం దాల్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు రాకుండా నదికి ఇరువైపులా కట్టలు నిర్మాణం చేశారు. బలహీనపడిన ప్రతిసారీ వరద కట్టలను కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆధునికీకరిస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న వరదకట్టల వద్ద ఇసుకను అక్రమంగా తవ్వేయటంతో ముంపు భయం కలుగుతోందని రైతులు వాపోయారు. రోడ్లు ఏర్పాటు చేసుకుని ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు చేస్తున్నారు. వంతెన సామర్థ్యానికి మించిన లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు వాపోయారు. జలవనరులశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు.
penna river: పెన్నానది వరద కట్టలు తవ్వేస్తున్న ఇసుకాసురులు - penna river floods
ఇసుకాసురులు పెన్నా నది పొర్లుకట్టల రూపురేఖలను మార్చివేయటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. భారీగా ఇసుకను తవ్వేస్తూ, సామర్థ్యానికి మించి తరలిస్తూ, వరద కట్టడి నిర్మాణాల ధ్వంసానికి కారణమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్బంది రాకుండా చూస్తామని చెబుతూనే.. నష్టం జరుగుతోందని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
సంగం బ్యారేజి నిర్మాణంలో భాగంగా పెన్నా నదికి ఎడమవైపున సంగం ఎగువ భాగంలో రూ.2.61 కోట్లు వ్యయంతో పొర్లు కట్టలు నిర్మించారు. ఇరువైపులా నిర్మించిన కట్టలను ఇసుకాసురులు ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు అంటున్నారు. పెన్నానదిలో పూడిక తొలగించేందుకు రెండు ఇసుక రేవులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇసుక రేవుల నిర్వాహకులు ప్రత్యేకంగా రహదారి నిర్మించుకోకుండా 200 మీటర్ల మేర పొర్లుకట్టలను ధ్వంసం చేసినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. వెయ్యి ఘనపు మీటర్ల అడుగుభాగం వరకూ గ్రావెల్ తవ్వేశారని చెప్పారు. ఈ చర్యలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు వాపోయారు. వ్యవసాయ భూముల్లోకి వరద వస్తే ఇసుక మేటలు వేస్తుందని, ఇప్పటికే ఒక పంట ఆపేశామని ఇంకా ఎంత నష్టపోవాలో తెలియట్లేదని రైతులు భావోద్వేగమయ్యారు.
ఇవీచదవండి.