నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో లక్షా ఎనభై వేల ఎకరాలకు ఈనెల 20వ తేదీన సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో రైతులు పొలాల్లో నాట్లకు సిద్ధమయ్యారు. అయితే కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల సక్రమంగా నీరు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలువల్లో పేరుకుపోయిన చెత్త...
పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని సర్వేపల్లి కెనాల్, జాఫర్ సాహెబ్ కెనాల్, కృష్ణపట్నం కాలువ ప్రధానమైనవి. ఈ కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతో చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నాయి. కాలువల పరిధిలోని చిన్న కెనాల్స్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో కాలువల్లో పూడిక తీస్తే తప్ప నీళ్ల సమృద్ధిగా రావని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పూడికలు తీయాలని.. లేకుంటే రెండో పంట పండే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.