Penchalakona Brahmotsavam 2023: నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో నిర్వహించే నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మే ఒకటవ తేదీ నుంచి 7వ తేదీ వరకు.. వారం రోజుల పాటు ఈ బ్రహ్మెత్సవాలను నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకకు.. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు. నెల్లూరు జిల్లాలో పెంచలకోన ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతోంది.
బ్రహ్మెత్సవాలలో భాగంగా నిర్వహించే కృతువులకు భక్తులు వేలాది సంఖ్యలో ప్రతి సంవత్సరం తరలివస్తారు. ముఖ్యంగా నృసింహ జయంతి సందర్భంగా జరిపే బంగారు గరుడ వాహన సేవ, దాని తర్వాత మరుసటి రోజు నిర్వహించే కల్యాణాన్ని తిలకించటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గోనుపల్లిలో స్వామి వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు నరసింహస్వామి, చెంచు లక్ష్మి గొనుపల్లి నుంచి పెంచలకోనకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. గోనుపల్లిని నరసింహస్వామికి భక్తులు అత్తగారి ఇల్లు లాగా భావిస్తారు. రెండవ రోజు నుంచి వరసగా ధ్వజరోహనం, బంగారు హనుమంతు సేవ వాహనంతో, బంగారు గరుడ సేవ, స్వామివారి తిరు కల్యాణం, రథోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏడవ రోజు ఉత్సవ మూర్తులు తిరిగి మళ్లీ గొనెపల్లి గ్రామానికి శోభాయాత్రగ వెళ్లనున్నారు. ఆ గ్రామంలో నిర్వహించే గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.