నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి. ఎకరాకు రూ.35వేల పరిహారం ప్రకటించాలి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఎలాంటి ప్రకటన రాని పక్షంలో రైతులకు మద్దతుగా ఈనెల 7న అన్ని జిల్లాల్లో జనసేన నిరసన దీక్షలు చేపడుతుంది’ అని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శనివారం నెల్లూరు జిల్లాలోని కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లోని దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. రైతులు, చేనేతల సమస్యలను తెలుసుకున్నారు. వెంకటగిరిలో నీరు చేరిన మగ్గం గుంతలను పరిశీలించారు. ఉదయం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఎకరాకు రూ.35వేల పరిహారం జనసేన డిమాండ్ కాదని, అనేక మంది రైతుల గొంతుకేనని చెప్పారు. మనోనిబ్బరం కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.
మద్యం ఆదాయం ఉందిగా..
వైకాపా నాయకత్వం మద్యం నిషేధిస్తామని తొలుత చెప్పి.. అంచెలంచెలుగా చేస్తామని మాట మార్చి చివరకు ప్రభుత్వమే విక్రయాలను చేపట్టిందని పవన్‌కల్యాణ్ విమర్శించారు. బూమ్, సుప్రీం, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ అంటూ చిత్రవిచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ విన్నాం కానీ.. బంగారు ఆంధ్రా అంటూ మద్యం బ్రాండ్ల రూపంలో అమ్మడం విడ్డూరమన్నారు. సీఎం మెడల్, వైసీపీ స్పెషల్ అని బ్రాండ్లు కూడా పెట్టి అమ్మి సొమ్ము చేసుకోండని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.16వేల కోట్లను తుపాను బాధిత రైతులకు కేటాయించాలని కోరారు. కడుపు మండిన రైతులు బయటకు వస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. తుపాను సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల బుగ్గవంక నీటిలో కడప నగరం మునిగిందని, 20వేల కుటుంబాలు గూడు కోల్పోయాయని వివరించారు.