Pathetic Situation Of Old Couple in Atmakuru : "మాకు ముగ్గురు పిల్లలు.. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. మా ఆస్తులు తీసుకోని తరిమేశారు. మా ప్రాణం పోక, ఆగక అల్లాడుతున్నాము" ఇది ఓ వృద్ధ దంపతులు కన్నీటి విషాద గాధ. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడంటారు. కానీ ఈ పుత్రుడు వారి తల్లిదండ్రులకు మానసికంగా నరకాన్ని చూపిస్తూ.. వాళ్లు ఎవ్వరో నాకు తెలీదండూ ఖరాకండిగా మాట్లాడుతున్నాడు. కూతుర్లు సైతం ససేమిరా అంటూ వారిని అనాథలను చేశారు. ఆ వృద్ధ దంపుతులు బతుకు బండిని ఈదలేక అలసి పోతున్నారు. కానీ వారి దీనస్థితిని అర్థం చేసుకున్న స్థానికులు మానవత్వంతో వారికి తోచిన సహాయం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఏసీఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్న జాఫర్ హుస్సేన్, బీబీ జాన్ అనే వృద్ధ దంపతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ముగ్గురు సంతానం ఉన్న వీరికి అన్నం పెట్టే కుటుంబ సభ్యులు లేక అనాథలుగా మిగిలారు. ముగ్గురు పిల్లలు వీళ్లని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లారు. వృద్ధురాలు కిడ్నీల సమస్యతో మంచం పట్టగా, భర్త జాఫర్ హుస్సేన్ పక్షవాతంతో కాలు చేయి పని చేయడం లేదు. ఇలా ఇద్దరు అనారోగ్యంతో ఉండటంతో వండుకోలేక తిండి పెట్టేవాళ్లు లేక మంచాన పడి అల్లాడుతున్నారు.
ఏటువంటి బంధుత్వం లేకపోయినా చుట్టుపక్కల ఉండేవాళ్ల అయ్యో పాపం అంటూ మానవత్వంతో వారికి అన్నం పెట్టి తోచిన సహాయం చేస్తూ వీరిని ఆదుకుంటున్నారు. ఆస్తిపాస్తుల పంపకాలలో ముగ్గురు పిల్లలు వీరిని విభేదించి ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో.. వీరిని పట్టించుకునే వారే లేక అనాథలుగా మిగిలారు. జాఫర్ హుస్సేన్ ఉన్నతంగా బ్రతుకుతూ పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన శక్తి కొద్ది పిల్లలను పెద్ద చేసి కుమారుడికి, ఇద్దరు ఆడ పిల్లలకు వివాహాలు జరిపారు.
"నాకు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఆ ముగ్గురు నా ఆస్తులు తీసుకోని తరిమేశారు. మా ప్రాణం పోక, ఆగక అల్లాడుతున్నాము. బాధలు పడుతూ జీవితాన్ని నెట్టుకొట్టుస్తున్నాము."- జాఫర్ హుస్సేన్, బాధిత వృద్ధుడు
తమ పిల్లలు తనకున్న ఆస్తులు పంచుకొని అనంతరం తమను అనాథలుగా వదిలేసి ఎవరు దారిన వారు వెళ్లిపోయారని జాఫర్ హుస్సేన్ ఆవేదనతో తెలిపారు. ఈ వృద్ధులు కొద్ది రోజులు బాగానే ఉన్నా ఒక్కసారిగా ఇద్దరు అనారోగ్యం పాలై మంచాన పట్టడంతో వీరిని ఆదుకోవాల్సిన కన్నబిడ్డలు కనికరం కూడా లేకుండా వదిలేసి కంటికి కనిపించకుండా వెళ్లిపోయారు. మంచానపడ్డ ముసలి దంపతుల పరిస్థితిపై స్థానికులు వారి పిల్లలకు సమాచారం ఇచ్చారు. కానీ వారు మాత్రం కనికరం లేకుండా వాళ్ల గురించి మాకు అవసరం లేదు.. మాకు మీరెవరూ ఫోన్ చేయొద్దంటూ.. సమాధానం చెప్పడంతో చుట్టుపక్కల ఉండే వారు వృద్ధ దంపతుల బాధను చూస్తూ ఉండలేక.. తలా కాస్త సహాయం చేస్తున్నారు. ఆ వృద్ధ దంపతులు బ్రతుకు బండి ఈ విధంగా ఈడ్చుకుంటూ వస్తున్నారు.