ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దివ్యాంగుడు ఏమి చేస్తాడని అనుకున్నారు... బంగారు పతకాన్ని సాధించాను'

సొంత ఇంటి నుంచే అవరోధాలు ఎదురయ్యాయి.... దివ్యాంగుడికి పరుగు పందేలు ఏంటని చుట్టూ ఉన్నవారు అవహేళన చేశారు. వాటిని పట్టించుకోలేదు. తన లక్ష్యంపైనే దృష్టి సారించాడు... పారా ఒలంపిక్స్​లో దేశానికి బంగారు పతకం తెచ్చాడు. తన గెలుపే... నువ్వేమీ చేయలేవని అన్నవారికి సమాధానంగా నిలిచాడు. అంతటితో ఆగలేదు... ఆటలపై ఆసక్తి ఉన్న చిన్నారులకు శిక్షణ ఇస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాల పంట పండిస్తున్నాడు. అతడే నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన లక్ష్మయ్య.

training
ఆదర్శం ఈ పారా అథ్లెట్

By

Published : Jan 25, 2021, 5:47 PM IST

Updated : Jan 25, 2021, 5:59 PM IST

ఆదర్శం ఈ పారా అథ్లెట్

అంగవైకల్యాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు.. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన లక్ష్మయ్య... ఇటీవల నేపాల్​లో జరిగిన పారా ఒలంపిక్స్​లో పాల్గొని.. 100 మీటర్ల పరుగు పందెంలో దేశానికి బంగారు పతకాన్ని సాధించాడు. జాతీయ స్థాయిలో 30కి పైగా పతకాలు సొంతం చేసుకున్న లక్ష్మయ్య తల్లిదండ్రులు నిరుపేదలు.

డిగ్రీ వరకు చదువుకున్న లక్ష్మయ్యకు చిన్నప్పుడు పోలియో సోకి... ఒక కాలు సన్నగా మారింది. వేగంగా నడవటమే కష్టం అనుకున్న తరుణంలో... క్రీడలపై ఉన్న ఆసక్తితో పరుగును సాధన చేయటం మెుదలుపెట్టాడు.

మెుదట పరుగు పందెం కోసం కసరత్తులు చేస్తుండటంతో.. ఇంటి నుంచే వ్యతిరేకత వచ్చింది. అయినా పట్టు వదలకుండా లక్ష్యాన్ని సాధించాడు. క్రీడల్లో ప్రతిభను చూపటంతో.. రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు తన తల్లిదండ్రులను తానే చూసుకుంటున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాడు లక్ష్మయ్య.

తనలా క్రీడలపై ఆసక్తి ఉన్న 30 మంది చిన్నారులకు సైతం లక్ష్మయ్య శిక్షణ ఇస్తున్నాడు. తన దగ్గర శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ మంది.. నిరుపేదలనీ, తనకు వచ్చే జీతంలో కొంత నగదు, తన స్నేహితుల ద్వారా కొంత నగదు సమకూర్చుకొని, చిన్నారులకు కావాల్సిన అవసరాలు తీర్చుతున్నామన్నారు. ప్రభుత్వం సాయం చేస్తే.. అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులు ప్రతిభ చూపుతారని ధీమా వ్యక్తం చేశారు.

'గ్రౌండ్​లో పరుగెత్తుతుంటే అందరూ నవ్వుకున్నారు. వికలాంగుడు ఏమి చేస్తాడని అనుకున్నా.. నేను బాధపడలేదు. దేశానికి బంగారు పతకాన్ని అందించాను. ఇప్పుడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా.' - లక్ష్మయ్య, పారా ఒలంపిక్స్​లో బంగారు పతక విజేత.

ఇదీ చదవండి:'ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవం'

Last Updated : Jan 25, 2021, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details