ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నాపెద్దా... అంతా ఉల్లి కోసమే..!

క్యూలో నిలబడాలి... తమ వంతు రాగానే వేలికి సిరామార్కు తప్పనిసరి. లైన్లో గంటల తరబడి పడిగాపులు.... ఆహారం అందుబాటులో ఉంటే సరే,  లేకుంటే నీరసం తప్పదు. ఇవన్నీ.. ఓటర్ల పాట్లు కాదు. ఎంతకూ తగ్గని ఉల్లి ఘాటు ప్రభావం. ఒక్క కేజీ కోసం ఓపికున్నోళ్లు వేచిచూస్తుంటే... ముసలీముతకా సొమ్మిసిల్లి పడిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షం పడుతున్నా జనం మొండిగా నిలబడ్డారంటే...ఉల్లి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

onion problems in nellore district
onion problems in nellore district

By

Published : Dec 10, 2019, 8:10 AM IST


రాష్ట్రంలో ఉల్లిఘాటు ఎంతకూ తగ్గడం లేదు. ప్రాంతంతో నిమిత్తం లేకుండా... ఉల్లి కొరత ఊపిరాడనివ్వడం లేదు. ధరల మంట భరించలేక రాయితీ ఉల్లి దక్కించుకునేందు జనం అవస్థలు పడుతున్నారు. వణికించే చలిలో... వేకువజామున 5 గంటల నుంచే రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్నారు. అల్పాహారం కోసం వెళ్తే తిరిగి లైన్లోకి రానిస్తారో, లేదో అన్న ఆందోళనతో.. చాలామంది టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు. వరుసలో ఓపిగ్గా నిలుచుంటున్నారు.

చిన్నాపెద్దా..కిలోమీటర్ల లైన్..అంతా ఉల్లి కోసమే!
చిన్నాపెద్దా తేడా లేకుండా..
నెల్లూరు జిల్లా బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి 150 రూపాయల వరకూ పలుకుతోంది. రేటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వ్యాపారుల మాటతో... రాయితీ ఉల్లి కోసం జనం పరుగులు తీస్తున్నారు. రైతుబజార్ల వద్ద భారీ వరసలు కనిపిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులతో పాటు... క్యూల్లో గర్భిణులు నిలబడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక్కడి సిబ్బంది... ప్రజలకు ఉల్లి పంపిణీ చేశాక, వచ్చినవాళ్లే మళ్లీ రాకుండా, వేలికి సిరా అద్ది మరీ పంపిస్తున్నారు. రైతుబజార్ వద్ద కనీసం రెండు, మూడు కౌంటర్లైనా పెడితే... ఇన్ని తిప్పలు ఉండవని ప్రజలు వాపోతున్నారు. కుళ్లిన ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.



కావలిలో కిలోమీటరుకు పైగా ర్యాలీ
కావలిలోని రైతు బజార్‌లో అయితే రాయితీ ఉల్లి కోసం ప్రజలు కిలోమీటరు పైగా వర్షంలోనే బారులు తీరారు. తోపులాట జరగడంతో... బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. తమవంతు వచ్చేసరికి నిల్వ అయిపోయి... కొందరు నిరాశగా వెనుదిరిగారు. రాయితీ ఉల్లిని కొందరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి : ఐదేళ్లలో ఏపీకి 7వేల 361 కోట్ల విదేశీ రుణం

ABOUT THE AUTHOR

...view details