నెల్లూరు జిల్లాలో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. శనివారం నుంచి హడావుడి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. కావలి రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 9 మండలాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతుండగా.. అందులో కావలి, ఉదయగిరి నియోజకవర్గ మండలాలే ఉండటం గమనార్హం. వీటికి సంబంధించి తొలి రోజు మొత్తం 27 నామినేషన్లు సర్పంచి స్థానానికి, 46 వార్డు సభ్యుల స్థానానికి దాఖలయ్యాయి. వీటిలో కొందరు డమ్మీలుగానూ వేసిన పరిస్థితి ఉండగా... మరికొందరు స్వతంత్రులు, తిరుగుబాటుదారులుగా బరిలో కనిపిస్తుండటం గమనార్హం.
తొలిరోజు ఎక్కువగా తెదేపా మద్దతుదారుల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచి స్థానాలపరంగా వరికుంటపాడు మండలం నుంచి ఎక్కువ రాగా.. వార్డు సభ్యులపరంగా దగదర్తిలో నమోదయ్యాయి. దగదర్తి మండలంలో చవటపుత్తేడు పంచాయతీకి అత్యధికంగా సర్పంచి స్థానానికి 4, వార్డు సభ్యులకు 16 నామినేషన్లు పడ్డాయి. ఈ ఒక్క పంచాయతీలోనే 20 నామినేషన్లు రావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో శ్రీరామపురం నిలిచింది.
ఎక్కడెక్కడ ఎలాగంటే..
అల్లూరు పురిణి పంచాయతీ సర్పంచి స్థానానికి తెదేపా బలపరచిన వ్యక్తి, బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీకి వైకాపా మద్దతుదారు, నాగులవరంలో స్వతంత్ర అభ్యర్థి, ఉమామహేశ్వరంలో వైకాపా సానుభూతిపరులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ముహూర్తం బాగోలేదంటూ దుత్తలూరు మండలంలో ఎవరూ ముందుకు రాలేదు. కలిగిరి మండలం పెద్దకొండూరు పంచాయతీకి సర్పంచి అభ్యర్థిగా తెదేపా బలపరిచిన వ్యక్తి, కావలి మండలం చెంచుగానిపాళెం పంచాయతీ సర్పంచి స్థానానికి రెండు నామినేషన్లు దాఖలవగా... ఇద్దరూ తెదేపా మద్దతుదారులే. లక్ష్మీపురం సర్పంచి స్థానానికి వైకాపా మద్దతుదారు ఒకరు, మన్నంగిదిన్నె సర్పంచి స్థానానికి ఓ స్వతంత్ర అభ్యర్థి, కొండాపురం మండలం గానుగపెంటలో స్వతంత్ర అభ్యర్థి, వరికుంటపాడు మండలంలో రామాపురం, విరువూరు, నార్త్‌కొండాయపాళెం, ఇస్కపల్లి పంచాయతీల్లో తెదేపా బలపరిచిన వారు నామినేషన్లు దాఖలు చేశారు.