నెల్లూరు ఆర్టీసీ డిపో పరిధిలో తిరుగుతున్న గ్రామీణ ప్రాంతాల బస్సుల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టడం లేదు. బస్సులు ఇతర ప్రాంతాల నుంచి రాగానే ప్రయాణికులు వాటిలో కూర్చోవడం, అవి బయలుదేరడం జరుగుతోంది. ఉదయం గ్యారేజీ నుంచి తీసే బస్సుల్లో ఒకసారి మాత్రమే శానిటైజేషన్ జరుగుతోంది.
రోజుకు ఒక్కసారే..
గ్యారేజీ నుంచి బస్సులు బయటకు వచ్చే సమయంలోనే ఆర్టీసీ అధికారులు శానిటైజేషన్ చేస్తున్నారు. ఇక్కడి డిపో నుంచి నెల్లూరు, ఉదయగిరి, ఆత్మకూరుకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కావలి బస్టాండు నుంచి నెల్లూరుకు 27 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బస్సు బయలుదేరింది. దీనికి కూడా శానిటైజేషన్ చేయకుండా పంపారు.
నాయుడుపేట కూడలి ఆర్టీసీ బస్సుస్టాండు మీదుగా నెల్లూరు, తిరుపతి, పరిసర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాండు నుంచి పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కో ట్రిప్పునకు 30 మంది వరకు ప్రయాణికులు ఎక్కుతున్నారు. బస్టాండు ఆవరణలో ఉదయం పూట శానిటైజేషన్ చేస్తున్నారు. ఇక బస్సులోపల ఎవరూ చేయడం లేదు.
బొబ్బలతో బెంబేలు..
ఆత్మకూరు నుంచి నెల్లూరు, కావలి మార్గంలో బస్సులు తిరుగుతున్నాయి. గమ్యస్థానానికి వెళ్లి వచ్చిన బస్సులో శానిటైజేషన్ నిర్వహించడం లేదు. కొద్దిపాటి బ్లీచింగ్ పొడిని మిళితం చేసిన నీటిని సీసాల్లో ఏర్పాటు చేసి ఉంచుతున్నారు. అవి అరచేతిలో వేసుకుని రుద్దుకుంటే మంటపుడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఈ విషయంపై ఆర్టీసీ ఆర్‌ఎం పీవీ శేషయ్యను వివరణకోరగా బస్సులు, బస్టాండ్లలో ప్రత్యేక సిబ్బందితో విడతల వారీగా శానిటేషన్ చేయిస్తున్నామన్నారు. ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.