ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Spandana Program: జగనన్నకు చెప్పినా కానరాని స్పందన.. పదే పదే మొరపెట్టుకున్నా ప్రతిఫలం లేదని ధ్వజం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక

No Response For Spandana Program: జగనన్నకు చెబుదామంటూ స్పందన కార్యక్రమం పేరు మార్చినా ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీ దారులు వాపోతున్నారు. సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spandana Program
Spandana Program

By

Published : May 30, 2023, 7:34 AM IST

జగనన్నకు చెప్పినా కానరాని స్పందన.. పదే పదే మొరపెట్టుకున్నా ప్రతిఫలం లేదని ధ్వజం

No Response For Spandana Program: ప్రజా సమస్యల పరిష్కార వేదికైన స్పందన కార్యక్రమానికి బాధితుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. సమస్యలు మాత్రం ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. సమస్య ఎలాంటిదైనా నెల లోపు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నామని ఏలూరు స్పందనకు వచ్చిన అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందనలో ఫిర్యాదు చేస్తే.. అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రకాశం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఫిర్యాదుల స్వీకరణ కేవలం మొక్కబడి కార్యక్రమంగా మారిందని వాపోతున్నారు. ఇంటి కోసం, స్థల వివాద పరిష్కారం కోసం పనులు మానుకుని తిరగలేక ఇబ్బంది పడుతున్నామని ఏకరవు పెడుతున్నారు.

30ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి.. కొందరు తమదంటూ దొంగ పత్రాలు సృషించారని నెల్లూరు జిల్లా కేశవరం రైతు మాల్యాద్రి ఆరోపించారు. కుటుంబానికి ఆధారమైన భూమి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని వాపోయారు. పంట కాలువ ఆక్రమణలపై ఇప్పటికే ఏడు సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని నెల్లూరుకు చెందిన సురేష్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. స్థలవివాదంపై కాలయాపన చేస్తూనే ఉన్నారని మల్లిఖార్జునరెడ్డి అనే అర్జీదారుడు ఆరోపించారు. తన తల్లిదండ్రుల పేరిట ఇందుకూరుపేట మండలం కొమరికలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని అధికారులతో కుమ్మకై కొందరు వారి పేరు మీద ఎక్కించుకున్నారని ఫిర్యాదు చేస్తే ప్రయోజనం శూన్యమని సుబ్బరావమ్మ అనే న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందన కార్యక్రమంలో ఎలాంటి న్యాయం జరగడం లేదని కడప జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా పొలంలో బోరు వేశారని ఫిర్యాదు చేసినా...తహసీల్దార్‌ పట్టించుకోలేదని సింహాద్రిపురానికి చెందిన రైతు ఆరోపించారు. త్రిచక్ర వాహనం కోసం ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ...ఇంతవరకూ స్పందించలేదని వీరపునాయునిపల్లెకు చెందిన నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు.

2023 జనవరి 1 తేదీ నుంచి మే 8 తేదీ వరకూ 7 లక్షల 60 వేల 714 ఫిర్యాదులు వస్తే అందులో 7 లక్షల,48 వేల 588 ఫిర్యాదులను పరిష్కరించినట్టు ప్రభుత్వం తెలిపింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత మే 9 తేదీ నుంచి 39,339 ఫిర్యాదులు నమోదు అయినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 18,916 ఫిర్యాదులను పరిష్కరించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పందనలో అత్యధికంగా రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులే నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏ ఒక్కసమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఒకే సమస్యపై ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినా.. అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. రెవెన్యూ విభాగంలో భూమికి సంబంధించి 7.68 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి 9.14 లక్షల మేర ఫిర్యాదులు నమోదయ్యాయి. మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించి 2 లక్షల మేర ఫిర్యాదులు, రవాణా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై దాదాపుగా లక్ష , వ్యవసాయం, పోలీసు విభాగం, తదితర అంశాలపై 50 వేల చొప్పున ఫిర్యాదులు నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details