ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినా కానీ.. ఖర్చు చేయరు ..! - గ్లౌజులు లేకుండా కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బంది

వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు నమూనాలు సేకరిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొవిడ్‌ సేవల నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. పరీక్షల మొదలు టీకా వరకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, ఇతరత్రా సిబ్బంది పని చేస్తుండగా- వీరికి ప్రభుత్వం సర్జికల్‌ మాస్కులు, ఎన్‌-95 మాస్కులు, గ్లౌజులు వంటివి సరఫరా చేస్తోంది. కానీ.. అవి క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు.

no precautions
no precautions

By

Published : May 11, 2021, 5:36 PM IST

ఆశా కార్యకర్త: సార్.. చేతులకు గ్లౌజులు లేవు.

హెల్త్‌ అసిస్టెంట్‌: మీ డబ్బుతో కొనుక్కోండి.

ఆశా కార్యకర్త: అయ్యా.. నమూనాలు నెల్లూరు తీసుకువెళ్లాలి.

హెల్త్‌ అసిస్టెంట్‌: రవాణా ఛార్జీలు.. మీరే పెట్టుకోండి.

ఆరోగ్య కార్యకర్త: సార్‌.. కొవిడ్‌-19 నమూనాలు సేకరించాలి.. ఎన్‌95 మాస్కులు కావాలి..

హెల్త్‌ అసిస్టెంట్‌: మా వద్ద లేవు..

ఇదీ కింది స్థాయి సిబ్బంది పరిస్థితి. వైరస్‌ నిర్ధరణ పరీక్షలకు నమూనాలు సేకరిస్తున్న దుస్థితి. కొవిడ్‌ సేవల నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. పరీక్షల మొదలు టీకా వరకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, ఇతరత్రా సిబ్బంది పని చేస్తుండగా- వీరికి ప్రభుత్వం సర్జికల్‌ మాస్కులు, ఎన్‌-95 మాస్కులు, గ్లౌజులు వంటివి సరఫరా చేస్తోంది. కానీ, అవి క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు.

పీహెచ్‌సీలకు వైద్య, ఆరోగ్యశాఖ నుంచి వస్తున్నవి పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉండగా.. విధిలేని పరిస్థితుల్లో అవేమీ లేకుండానే ఆయా విభాగాల సిబ్బంది విధుల్లో భాగస్వాములు కావాల్సి వస్తోంది. కొవిడ్‌ పరీక్షలు చేసే క్రమంలో ఆశా.. ఆరోగ్య కార్యకర్తలకు తోడుగా ఉంటారు. నమూనాలు సేకరించడం, భద్రపరచడంలో తోడ్పాటు అందిస్తుంటారు. వీరికి కనీసం గ్లౌజులు కూడా లేకపోవడం గమనార్హం. నమూనాలు తీసే ఆరోగ్య కార్యకర్తలకూ కొన్నిచోట్ల ఎన్‌-95 మాస్కులు ఉండటం లేదు. ఎక్కువ ప్రాంతాల్లో పీపీఈ కిట్లు సైతం ఉండటం లేదు. దీంతో వీరందరి ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారింది.

ఒక్కో వైద్యాధికారికి..

నెల్లూరు జిల్లాలోని 75 పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులకు కొవిడ్‌ సేవల నిమిత్తం నెలకు రూ.25వేలు ఇస్తున్నారు. గత ఏడాదిగా ఆ మేరకు నిధులను వారికి కేటాయిస్తున్నారు. వీటిని చిన్నపాటి ఖర్చులకు వినియోగించాల్సి ఉండగా, పలుచోట్ల కనీసం కింది స్థాయి సిబ్బంది అవసరాలకూ వినియోగించడం లేదన్న విమర్శలున్నాయి. రవాణా ఖర్చులు, గ్లౌజులు, ఆహారం తదితరాలకు వెచ్చించడం లేదని సమాచారం. దీంతో ఒకో పీహెచ్‌సీకి ఇస్తున్న ఈ నిధులు ఎక్కడికి పోతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతుండగా- పక్కదారి పడుతున్నాయని కిందిస్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు.

సొంత అవసరాలకు...

పీహెచ్‌సీలకు కేటాయిస్తున్న ఎన్‌95 మాస్కులు, గ్లౌజులు పక్కదారి పడుతున్నాయని, వాటిని తమకు కేటాయించకుండా సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విధుల నిమిత్తం అడిగిన సమయంలో లేవని చెబుతుండటం.. వాటికి బలం చేకూరుస్తోంది. గ్లౌజులు లేకుండా, ఎన్‌95 మాస్కులు పెట్టుకోకుండానే కొవిడ్‌ నమూనాలు సేకరిస్తున్నారు. టీకా వేసే క్రమంలోనూ గ్లౌజులు ఉండటం లేదు.

దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా... వైద్యాధికారులకు ఇచ్చిన నిధులను.. వారు మండలంలో తిరిగే సమయంలో రవాణా అవసరాల నిమిత్తం ఖర్చు చేసుకోవాలి. ఎన్‌95 మాస్కులు, గ్లౌజులు లేకుండా కొవిడ్‌ నమూనాల సేకరణ చేయకూడదు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో... ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో కరోనా ప్రోటోకాల్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details