ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంధకారంలో సోమశిల.. విద్యుత్ సరఫరా లేక ఇబ్బందిపడ్డ సిబ్బంది - no power in somasila project Nellore district updates

నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమశిల జలాశయ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. గురువారం ఉదయం నుంచి విద్యుత్​ లేకపోవడంతో క్రస్ట్‌గేట్లను నియంత్రించేందుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు.

somasila project Nellore district
somasila project Nellore district

By

Published : Nov 27, 2020, 1:03 PM IST

సోమశిల జలాశయ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. తుపాను నేపథ్యంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జనరేటర్‌ అందుబాటులో ఉన్నా పని చేయడం లేదు. ఈ సమస్య దీర్ఘకాలంగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు లేకపోవడంతో క్రస్ట్‌గేట్లను నియంత్రించేందుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో జలవిద్యుత్తు కేంద్రం జనరేటర్‌ని వినియోగించారు. దీనికి ఇంధనం అయిపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. దీంతో కలువాయికి సిబ్బంది పరుగులు తీశారు. ఎగువనుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. ఈ సమయంలో గంటగంటకీ రీడింగ్‌ తీయాల్సి ఉంది. చీకట్లో రీడింగ్‌ తీసే పరిస్థితి లేదు. ఫలితంగా గేట్లను నియంత్రించడంలో తేడా వస్తోంది. ఏదైనా జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యని ‘ఈనాడు’ గత వరదల సమయంలో వెలుగులోకి తెచ్చింది. అయినా అధికారులు మేల్కోలేదు. దీనిపై ఎస్‌ఈని వివరణ కోరగా విద్యుత్తు శాఖ ఎస్‌ఈతో మాట్లాడామని, దీన్ని పరిష్కరిస్తామని చెప్పారని వివరించారు. అత్యసవరమైతే జలవిద్యుత్తు కేంద్రం జనరేటర్‌ అందుబాటులో ఉందన్నారు. ఇంధనం కూడా సమకూరుస్తామన్నారు.

1,15,390 క్యూసెక్కుల వరద..

నెల్లూరు-కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం రాత్రి నుంచి వరద క్రమేపీ పెరుగుతూ సాయంత్రానికి 1,15,390 క్యూసెక్కులకు చేరింది. దాంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. జలాశయం ఆరు గేట్ల ద్వారా 84,491 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయానికి వచ్చే వరద నీరు పరిస్థితిపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సమీక్షించారు. జలాశయం నుంచి నీటి విడుదల పెంచుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సువర్ణమ్మ హెచ్చరించారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో వర్షాల పరిస్థితిపై డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ సోమయ్య, అగ్నిమాపకశాఖ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి:నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం

ABOUT THE AUTHOR

...view details