150చదరపు కిలోమీటర్లు.. 54 డివిజన్లు. 8లక్షలకు పైగా జనాభాతో నెల్లూరు విస్తరించింది. నగరం చుట్టూ 50కిపైగా కాలనీలు ఉన్నాయి. జనాభా కూడా పెద్దసంఖ్యలోనే శివారు కాలనీల్లో ఉంటున్నారు. సగానికి పైగా కాలనీల్లో సరైన రోడ్లు, మురుగుపారుదల సదుపాయం లేదు. 30శాతం కాలనీల్లో మంచినీటి సరఫరా, వీధి లైట్లు లేవు. చెత్త నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో పారిశుద్ధ్యం లోపించింది. దోమలు, పాములు, పందుల బెడదతో కంటిమీద కునుకు లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ గిరిజన కాలనీ, శ్రామిక నగర్, చంద్రబాబునగర్, జనార్ధనరెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, కావేరి నగర్, సుందరయ్యకాలనీ, ఇందిరమ్మకాలనీల్లో.. ఎక్కువగా కూలీలే నివసిస్తున్నారు. సరైన రోడ్లు లేక.. రాకపోకలు సాగించేందుకు కష్టంగా ఉందని వాపోతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు కానీ.. అభివృద్ధి పనులు మాత్రం చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.