రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన చేపట్టేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25గా చేయాలని యోచిస్తుండగా.. అందుకు సంబంధించి రాష్ట్ర, జిల్లా అధ్యయన కమిటీలను నెలన్నర కిందట ప్రకటించారు. దాంతో ఈ నెల ప్రారంభంలో జిల్లా కమిటీ కలెక్టర్ చక్రధర్‌బాబు అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించింది. శాఖల వారీగా వివిధ అంశాలపై అధ్యయనం చేసి 28వ తేదీన రెండో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఆ సందర్భంగా బ్రిటీష్ కాలం నాటి జిల్లా రికార్డులనూ పరిశీలించాలని ఆదేశించారు. సుమారు 20 రోజుల అధ్యయనం అనంతరం సోమవారం జిల్లా కమిటీ తిరిగి సమావేశమైంది. అధికారులు పలు అంశాలను సూచించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రధాన మార్పులు..
జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఉండగా- మిగిలిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలు తిరుపతి లోక్‌సభ స్థానం కింద ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పార్లమెంటరీ స్థానాల ప్రాతిపదికన విభజన జరిగితే నాలుగు అసెంబ్లీ స్థానాలు తిరుపతి పరిధిలోకి వెళతాయి. ఈ స్థితిలో జిల్లా వాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఈ విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలనే దిశగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి నివేదిక పంపనుంది. సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోకి చేర్చాలని; గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ స్థానాలను నెల్లూరు లోక్‌సభ పరిధిలోనే కొనసాగాలని ప్రతిపాదిస్తున్నారు.