NIA searches in AP : ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాస్... అతడి మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులను ఇలియాస్ బంధువులు, మిత్రులు అడ్డుకోగా... పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఎన్‌ఐఏ అధికారులు అనుమానితుల ఇళ్లలో సెల్‌ఫోన్, డైరీ స్వాధీనం చేసుకున్నారు. ఇలియాస్ రెండు నెలలుగా కనిపించడంలేదని కుటుంబసభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలలో సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుల నివాసాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. సోదాలకు వ్యతిరేకంగా.. కొందరు ఆందోళనకారులు నినాదాలు చేయగా... పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో 38 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సూరారం సాయిబాబానగర్‌లోని జమీయ తలిముల్ ఇస్లాం మదరసాలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయుడిని పీఎఫ్‌ఐ సభ్యుడిగా గుర్తించి అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 23 చోట్ల జల్లెడ పట్టారు. నగరంలోని కంఠేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తిని.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఎడపల్లి మండలం ఎమ్మెస్సి ఫారంలో ఓ యువకుడి ఇంట్లో సోదాలు చేపట్టి... రెండు చరవాణులు, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ దాడులు జరిగాయి. ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్ కాలనీలో ఓ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ కు నుంచి వచ్చి కొంతకాలంగా నివాసం ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోనూ రెండు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భైంసాలోని మదీనా కాలనీలో కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించి పీఎఫ్‌ఐ సంస్థ శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు.