నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియలోని వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న హానిపై...అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT).. సంయుక్త నిపుణుల కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. పొగాకు నుంచి నూనె తీసే కర్మాగారాన్ని బల్క్ డ్రగ్ కర్మాగారంగా మార్చడమే కాకుండా వ్యవసాయ బావుల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారని...వేమూరు భాస్కర్రావు అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ఎం. సత్యనారాయణన్, జస్టిస్ బ్రిజేశ్ సేథి, విషయ నిపుణుడు డాక్టర్ నగిన్ నందాలతో కూడిన ధర్మాసనం..ప్రత్యేకంగా సంయుక్త నిపుణుల కమిటీ నియమిస్తూ...మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి, రాష్ట్ర కర్మాగారాల ముఖ్య ఇన్‌స్పెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్లను కమిటీ సభ్యులుగా నియమించింది. కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యంతో స్థానికంగా జల వనరులు, వాయు నాణ్యతపై చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసి...నివేదిక ఇవ్వాలని సంయుక్త నిపుణుల కమిటీకి ఆదేశాలచ్చింది.