నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రాజోలుపాడు గ్రామలో గత నెల 20న అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కవలల కేసులో చిక్కుముడి వీడింది. కన్నతండ్రే పిల్లలిద్దరినీ పొట్టన పెట్టుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పుట్టా వెంకటరమణయ్య, నాగరత్నమ్మ భార్యాభర్తలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
ప్రేమించి పెళ్లి చేసుకొని..
వెంకటరమణ నెల్లూరులోని ఓ మెస్‌లో పనిచేసే సమయంలో నాగరత్నమ్మతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి ముందే నాగరత్నమ్మ గర్భం దాల్చటంతో పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో భార్య మెుదటి వివాహ విషయం చిచ్చు రేపింది. నాగరత్నమ్మకు తనతో పెళ్లికి ముందే వివాహం జరిగిందని వెంకటరమణకు తెలిసింది. అప్పటినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగరత్నమ్మ పండంటి కవలలకు జన్మనిచ్చింది.
భార్యపై క్షక్షతో..
తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని వెంకటరమణ.. నాగరత్నమ్మపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పిల్లలిద్దరినీ చంపేస్తే.. తన దారిన తానే వెళ్లిపోతుందని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం పాలల్లో విషపు గుళికలు కలిపి 10 నెలల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలను చంపేశాడు.