Nellore TDP Leader Abdul Aziz Comments: రాష్ట్రంలో 56 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోనూ మరో నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వీడుతారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు సడెన్గా మారిపోయాయని, పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నవారు జగన్ను వదిలి వచ్చేస్తున్నారని నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో అజీజ్ చెప్పారు.
అధికార పార్టీని వీడేందుకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ప్రయత్నించడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, ఇది రాష్ట్రానికి శుభ సూచికమన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ విధానాలపై గళమెత్తారన్నారు. సొంతపార్టీ నేతలపైనే ఫోన్ ట్యాపింగ్ పెట్టారంటే, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎప్పుటినుంచో ట్యాపింగ్ చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఏది చెప్తే అది చేసే పోలీసులు, ఇప్పుడు వారిని వారే రక్షించుకోలేక పోతున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.