నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy: పొట్టేపాలెం, మునుముడి కలుజుపై వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టే విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా ఆరో తేదీ 8గంటలు జలదీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీ నెరవేరలేదని మండిపడ్డారు. సీఎం సంతకానికే చెల్లుబాటు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జలదీక్ష:ఈ నెల ఆరో తేదీన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎనిమిది గంటలు జలదీక్ష చేయనున్నారు. నెల్లూరు గ్రామీణంలోని పొట్టేపాలెం వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, మునుముడి కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం పొట్టెపాలెం కలుజువద్ద నీళ్లలో కూర్చుని దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గంలో సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఎనిమిదిగంటలు నిరాహార దీక్ష చేపడతానని కోటంరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, సంతకం చేసినా దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఎస్పీ, డీఎస్పీలను అనుమతి కోరిన ఎమ్మెల్యే: నన్ను సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలుపై గాంధీ గిరిలో నిరసన తెలుపుతూనే ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. పొట్టేపాలెం కలుజు పై వంతెన నిర్మాణం కోసం 6వ తేదీ జలదీక్ష చేపడుతున్నానని ప్రకటించారు. అనుమతి కోసం జిల్లా ఎస్పీ, డీఎస్పీలను కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి విసిగి వేసారిపోయానని కోటంరెడ్డి వెల్లడించారు. 25 జులై 2019వ సంవత్సరం ముఖ్యమంత్రికి విజ్ఞాపన అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 10 రోజుల్లో పరిష్కారం చేయమని రాత పూర్వక లేఖ పంపించారని కోటంరెడ్డి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్వయంగా సమస్య పరిష్కరించమని అదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి అదేశాలిచ్చి నాలుగేళ్లయిన ఇంతవరకు సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు.
ఉద్యమించడానికి వెనుకాడను: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చేస్తే ఉద్యమించడానికి వెనుకాడనని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. నెల్లూరు సమస్యల పై తాను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే ప్రజలు తనకు అండగా ఉండాలని కోటంరెడ్డి కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి 30 కోట్లు విడుదల చేయలేరా అని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగనన్నకి చెపుతాము రండి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ప్రజలు చెప్పింది కూడా జగనన్న వినాలి అని కోరారు. కోట, వైఎస్ఆర్ కడప, అనంతపురం, బుచ్చిరెడ్డి పాలెం, ఉదయగిరి, ఆత్మకూరు, పామూరు ప్రాంతాలకు ఈ మార్గం మీదుగానే వెళ్లాలి. ఈ రెండు వంతెనలపై వంతెన నిర్మాణం చేప్పట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: