MLA Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లా రూరల్ సమస్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోమారు తన గళాన్ని వినిపించారు. ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సీఎం జగన్ మూడు సంతకాలు చేశారని.. అయినా ఇప్పటి వరకూ నిధులు మంజూరు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ పెట్టిన సంతకాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. "క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గత నాలుగు సంవత్సరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మూడు సార్లు సంతకాలు పెట్టినా అడుగు ముందుకు పడలేదు. అప్పటి నుంచి నిధులు మంజూరు కాలేదు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తైతే క్రిస్టియన్ సోదరుల పెళ్లిళ్లు, జన్మదిన వేడుకలు, ఇతరత్రా సామాజిక కార్యక్రమాలు జరుపుకోవడానికి తక్కువ ఖర్చులో ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిని కలిసి సంతకం పెట్టించాను.
అక్కడితో ఆగకుండా అప్పటి కలెక్టర్‌ను కలిసి గాంధీనగర్‌లో 150 అంకణాల స్థలాన్ని(1 అంకణం=72 చదరపు అడుగులు) కేటాయించాం. మొదటిసారి 2019 జూన్ 10వ తేదీన కమ్యూనిటీ హాల్ కోసం ముఖ్యమంత్రి జగన్ తొలి సంతకం చేశారు. 2021 ఫిబ్రవరి 3వ తేదీన రెండో సంతకం పెట్టారు. ఆ తర్వాత 2022 జులై 27వ తేదీన ముచ్చటగా మూడో సంతకం పెట్టారు. మూడు సంతకాలు పెట్టినా కూడా ఈనాటికి అమలు కాలేదు. ఈ నాలుగు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి కాలేదు. ఈ సమస్య ఈ నెల 18వ తారీఖు లోపు పరిష్కారం కాకపోతే ఆ తర్వాత నుంచి గ్రామీణ, నియోజకవర్గంలో ఉన్న ప్రతీ చర్చి నుంచి ఒక్కో ఇటుకను తీసుకొచ్చి గాంధీ నగర్లో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో పేర్చుతాము" అని కోటంరెడ్డి వ్యాఖ్యనించారు.